నువ్వు
చందమామను వెన్నెలమ్మ
అడిగింది
నేను ఎవరినని
విస్తుబోయిన నెలవంక
ఏమని చెబుతుంది
నువ్వు ఎవరివని
కడలి అలలను అలవోకగా
ముద్దాడుతూ
ముందుకు నడిపే పవనం
అడిగింది
నేనెవరినని
ఎగిపడిన అల నేలను తాకి
దిక్కులు చూసింది
నువ్వెవరివని
హృదయస్పందనలను
ఊపిరి అడిగింది
నేనెవరినని
స్పందనలు మరిచిన హృదయం
పిచ్చి చూపులు చూసింది
నేను ఎవరిని
అంటూ నీలో జనియించిన
ప్రశ్న
నాలో ఎన్నెన్నో
భావాలకు తెర లేపింది
ఏమని చెప్పను
ఎవరు నువ్వని చెప్పను
అస్తమించే నా జీవన
జ్యోతికి
వేగు చుక్కవు నీవు
నన్ను నడిపే శ్వాసలో
ప్రాణాన్ని నింపే
ఊపిరి నువ్వు
నా పెదాల చిరునవ్వు
నువ్వు
నా కన్నుల్లో
గూడుకట్టుకున్న
అందమైన కలవు నువ్వు
నా మానస సరోవరంలో
విరిసిన పద్మం నువ్వు
నువ్వు
అన్నీ నువ్వే
నా కోపం నువ్వు
నా కంట నీరు నువ్వు
నా విజయం నువ్వు
నా అంతం నువ్వు
నిజానికి
నేనే నువ్వు
మనస్వినీ
No comments:
Post a Comment