అదే నేను అదే మనసు
నీ కన్నుల వెన్నెలలో
రాలిపడిన నక్షత్రాల
పొడిని
నా కనురెప్పలపై
స్వప్నాలుగా అద్దుకున్నా
నీ నవ్వుల రువ్వులలో
పువ్వులను ఏరుకుని
గుండె గుడిలో
దాచుకున్నా
తీయని పలుకుల
మధురిమలను
మనసునిండా
పులుముకున్నా
ప్రతిక్షణం
ప్రతికణం
ప్రేమసాగరంలో
పునీతం చేసుకున్నా
ఎందుకో ఏమో
ఇప్పుడు మనసుకు భయం
వేస్తోంది
అప్పటిలా
ఇప్పుడూ ఉన్నా
ఎక్కడున్నానో
అక్కడే ఉన్నా
కనురప్పలపై నుంచి
జారిన
నక్షత్రాల పొడి
కన్నీటి పొరలలో
కరిగిపోతోందేమో
అల్లుకున్న
స్వప్నాలన్నీ
కన్నీటి చుక్కలతో
స్నేహం చేసి
ఆవిరైపోతున్నాయేమో
గుబులుగా ఉంది గుండెలో
దాచుకున్న పువ్వులన్నీ
సుడిగాలి కుట్రలకు
ఎగిరిపోతాయేమో
భయం ఒకవైపు మొలకలు
వేస్తున్నా
దానిపక్కనే భరోసా
చిగురిస్తోంది
రాలిపడుతున్న
నక్షత్రాల పొడిని
మరలా ఒడిసి పట్టుకుంటా
సుడిగాలికి
గుండె కవాటాలు అడ్డం
వేస్తా
ఆ నవ్వుల పువ్వులను
మరలా పూయిస్తా
కఫన్ నీడన నడుస్తున్న
నేను
ఆ భరోసా వెంటనే
సాగిపోతూ ఉంటా
మనస్వినీ
No comments:
Post a Comment