Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 30 September 2017

నేనే నేనే

నేనే నేనే
మలిసంధ్యను వీడి
నవ ఉదయానికి స్వాగతం పలుకుతున్నా
చీకటి ముసుగును విసిరేసి
కాంతి కిరణానికి బాటలు వేస్తున్నా
కాటు వేస్తున్న కలల పరదాలు చింపివేసి
కొత్త స్వప్నికలను గుండెకు హత్తుకుంటున్నా
గాయం చేసిన జ్ఞాపకాలను తుడిచేసి
మనసుకు లేపనం అద్దుకుంటున్నా
పుడమిని ముద్దాడిన మనసును ఓదార్చి
ఆకాశవీధికి నిచ్చెనలు వేస్తున్నా
గతకాలపు నిశి రక్కసిపై
కొత్త ఆశల ఆయుధాన్ని సంధిస్తున్నా  
ఇప్పుడు నింగీ నేలా నేనే
కాలగమనానికి నాలుగు దిక్కులూ నేనే
ఎందుకంటే
ఇప్పుడు నన్ను నేనే ప్రేమిస్తున్నా 

Thursday, 21 September 2017

వేకువలో వెన్నెలనే

వేకువలో వెన్నెలనే

భావలోకపు విహారిని నేను
కాల్పనిక జగత్తులో
అడుగుజాడలను వెతుక్కునే
శోధకుడిని నేను
నీలకాశానికి నిచ్చెన వేసి
మిలమిలా మెరిసే నక్షత్రం నేను
అక్షరాలను రెక్కలుగా చేసుకుని
అనంతవిశ్వంలో పయనించే
విహంగం నేను
ఎండమావిలో గొంతు తడుపుకున్న
దాహార్తిని నేను
మకరందంకోసం మైమరిచి
గులాబీ ముల్లుకు గాయపడిన భ్రమరం నేను
వేకువలో కురిసి కరిగిపోయిన
వెన్నెలనే నేను
నిజమేదో అబద్ధమేదో తెలియక మిగిలిన
అర్థంకాని ప్రశ్నను నేను
నాలో నన్ను వెతుకుతూ
నాలో నన్ను కోల్పోయిన
పరాజితుడిని నేను
నానుంచి నేను విడివడుతూ
నేనుగానే మిగిలిపోయాను నేను 

Wednesday, 20 September 2017

ఊహ

ఊహ
అందమైన ఊహవు నీవు
మనసైన పలకరింపు నీవు
మదిలో చిరుతలపుకే
పులకరింతలు రేపుతావు నీవు
చిన్ని చిన్ని ఊసులతోనే
కలవరింతలు కలిగిస్తావు నీవు
అవునంటే కాదంటూ
కాదంటే అవునంటూ
గుండెల్లో గుబులు కలిగిస్తావు నీవు
మనసూ మనసుల మంతనాలలో
వెచ్చని సెగలతో ఉడికిస్తావు  నీవు
కానరాని రూపంతో
కనులముందే కదలాడుతావు నీవు
 అందమైన ఊహవే కదా
ఊహిస్తూనే ఉంటాను నేను 

Saturday, 16 September 2017

సమయమా నీకు సలాం

సమయమా నీకు సలాం
కాలమా రుణపడి ఉన్నా నీకు
సమయమా సలాం చేస్తున్నా నీకు
గడియారంలోని ముళ్ళకు
తలవంచుతున్నా నేను
తరలిపోతున్న ప్రతి క్షణానికి
గులామునవుతున్నా నేను
వసంతంలా మనసును తాకి
ఎండమావిలా కరిగిపోయే
సమయమే లేకపోతే
నేనెక్కడా నా అనుభూతులు ఎక్కడా
ఊహలకే పరిమితమైన మనసుకు
అనుభవాలను నేర్పింది కాలం
తడి చేరని కన్నులకు
వెచ్చని కన్నీటిని పరిచయం చేసింది సమయం
మౌనమైన మనసుకు అక్షరాలు నేర్పింది
జారిపోయిన ప్రతి క్షణం   
గడిచిన ఘడియలే కాదు
దూసుకువచ్చే నిమిషమూ ప్రియమే నాకు
గడిచిన మధురిమలు
కరగకుండా కరుడుగట్టిన జ్ఞాపకాలు
కరిగిన కన్నీటిలో కొట్టుకుపోయిన స్వప్నాలు
పెదాలపై తేనియల పువ్వులు
హృదిలో చెలరేగే సునామీలు
ఈ క్షణం నుంచి మరో క్షణానికి
బదిలీ చేసుకుంటూ
కాలాన్ని నేస్తంగా మలుచుకుంటూ
సమయాన్నే ఉనికిగా మార్చుకుంటూ
గడియారం ముల్లు అడుగుజాడల్లో
అడుగులువేస్తూ నడుస్తున్నా
అనుభవ పుష్పాలను జారవిడుస్తూ 

Friday, 8 September 2017

హెచ్చరిక

హెచ్చరిక

కూలిన వైభవ శిఖర
శిథిలాలను తోసుకుంటూ
బయట పడుతున్నా మెల్లగా
కొత్త ఊపిర్లు పోసుకుంటూ   
కమ్ముకున్న నల్లమబ్బులను చీల్చుతూ
ముందుకు సాగుతున్నా
కన్నులనే కాగడాలు చేసుకుంటూ
శిఖర విధ్వంసానికి కారకులు ఎవరూ కారు
పునాదులలోనే ఎక్కడో లోపముందేమో
నల్లమబ్బులకు చందమామను నిందించను
నాకంటి చూపులోనే సమస్య దాగి ఉందేమో
బతకాలని అనుకుంటున్నా
బతకనివ్వాలనీ కోరుకుంటున్నా
అయినా నన్ను కెలుకుతున్నారు
చివరిసారిగా హెచ్చరిస్తున్నా
నడివీధిలో నగ్నంగా నిలబడినోడికి
బట్టలూడదీసి కొట్టడం సమస్యే కాదు
జీవించండి ప్రశాంతంగా
బతకనీయండి ఏదో ఒకలా 

Wednesday, 6 September 2017

మరణానికి సవాల్

మరణానికి సవాల్
 
హద్దులు సరిహద్దుల
గీతలు చెరిపేస్తున్నా
సహనం అసహనం మధ్య
వారధిని కూల్చేస్తున్నా
పనికిరాని విలువలను
వలువలుగా విసిరేస్తున్నా
కూడుపెట్టని సభ్యతా సంస్కారాలను
పాతాళానికి తొక్కేస్తున్నా
మెత్తని మాంసంముక్క గుండెకాయకు
రాతి కవచం తొడుగుతున్నా
ఎవడో పలికిన పలుకులకు కాదు
మనసు మాటకే కట్టుబడి ఉన్నా
ఇంకా ఏం జరుగుతుంది
ప్రతి ఘడియనూ మౌనంగానే
స్వీకరిస్తున్నా
కఫన్ తలకు చుట్టినవాడిని
మరణానికే సవాల్ విసురుతున్నా

Monday, 4 September 2017

గడ్డిపోచనే

గడ్డిపోచనే
నాకు నేనంటే ఎంతో అసహ్యం
స్వయంకృతాపరాధినై
మిగిలిపోయినందుకు
నాకు నేనంటే ఎంతో కోపం
నన్ను నేను
వంచన చేసుకున్నందుకు
నాకు నామీద ఎంతో సానుభూతి
నలుగురిలో పలచన అయినందుకు
నేనంటే నాకు ఎంతో చిన్నచూపు
జగన్నాటక పాత్రలో
రాణించలేకపోయినందుకు
నేనంటే నాకు అవమానం
అవహేళనకు తలవంచినందుకు
నాకు నేనంటే అంతే అభిమానం
మెదడును వాడక
మనసు మాటే విన్నందుకు
నాకు నేనంటే చాలా ఇష్టం
మారని మాటే నాదైనందుకు
నాకు నేనంటే చచ్చేంత ప్రేమ
సునామీలు చెలరేగినా
గడ్డిపోచలా నిలిచి ఉన్నందుకు