ప్రియతమవా
ప్రియతమ అని
నిన్ను పిలవనా
సజనీ అని
సంబోధించి సరదాపడిపోనా
నేస్తమని అంటూ
సరిపెట్టుకోనా
వయ్యారీ నిన్ను ఏమని పిలవను
గడుసరీ
నిన్నెలా చూడను
ముద్దుముద్దు
మాటలతో మురిపిస్తావు
చిలిపిసరదాలతో
కవ్విస్తావు
నీ వసంతమంతా
నాదేనని నమ్మబలుకుతావు
దేవుడిచ్చిన
కానుకనేనంటూ ఆశలెన్నో రేపుతావు
ఉడికిన
వయస్సులో ఆకలి రగిలి
పరువాల విందు
చేయమంటే
భయమంటూ
తప్పించుకుంటావు
ఔనంటే కాదంటూ
కాదంటే ఔనంటూ
మనసుతో
దోబూచులాడుతావు
రగిలిన తమకం
పడగ విప్పితే
ఆంక్షలెన్నో పెడుతూ
చిరునవ్వులు చిందిస్తావు
ఎగిసే తనువు
మంటలపై నీళ్ళు చల్లుతూ
తుర్రుమని
మాయమవుతావు
నిట్టూర్చిన
మనసును మరలా కదిలిస్తావు
గాయాలపై మమతల
లేపనం అద్దుతావు
ఏదో తెలియని భరోసాలా
మెరిసిపోతావు
ఏమని అనుకోను
నిన్ను
ఏమని పిలవను
నిన్ను
ప్రియతమవా
నేస్తానివా
కరిగిపోయే
అందమైన కలవా
No comments:
Post a Comment