Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Sunday, 31 December 2017

కొత్త సీసాలో పాత సారా

కొత్త సీసాలో పాత సారా 

వెళ్లిపోతున్నావా నువ్వు
వెళ్ళిపో ఆలస్యమెందుకు ఇంకా
నువ్వెళ్ళిపోయాక తనేలాగూ వస్తుంది వద్దన్నా ...
నీకు మనసునిండా వీడుకోలు చెప్పను
వచ్చేదానికి హృదయం పరిచి స్వాగతం పలకను
నా ప్రమేయమేమీ లేకనే రాకపోకలు జరిగిపోతాయి ...
నీవల్ల ఒరిగిందేమీ లేదు
రేపేదో జరిగిపోతుందనే భ్రమలూ లేవు
నువ్వంటే రవ్వంత అభిమానమూ లేదు
కొండంత ఆవేదన తప్ప ...
ఎన్ని అనుభవాలు చూపావు
వంచనా శిల్పాన్ని పరిచయం చేసావు
తడి గుండెలో మంటలు రేపావు
ఎందుకు ఆపాలి చెప్పు నిన్ను ...
అయినా ఆగమంటే ఆగుతావా
వద్దంటే నిలిచిపోతావా
వీడిపోయేందుకు క్షణాలు లెక్కపెడుతున్నావుగా ...
తరలివచ్చే క్షణమేమన్నా పూవులు విసురుతుందా
చిరునవ్వుల మతాబులు కానుకలుగా ఇస్తుందా
ఇలావచ్చి అలా వెళ్లక నిలకడగా ఉంటుందా ...
పోయేదానిపై గౌరవమూ లేదు
వచ్చేదానిపై నమ్మకమూ లేదు
కొత్త సీసాలో పాత సారా యవ్వారమంతా ...
అందుకే నువ్వెళ్ళిపో
వచ్చేదానికి చోటిచ్చిపో
కుడిఎడమైనా పొరపాటు లేదంటూ
అన్యమస్కంగానే రమ్మంటున్నా
వెల్ కం టూ న్యూ ఇయర్

1 comment: