Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 18 November 2017

తేరీ తలాష్ ఆజ్ భీ హై

తేరీ తలాష్ ఆజ్ భీ హై

ఆజ్ భీ మేరీ నిగాహ్ ఆస్మాన్ కీ ప్యాసీ హై...
బేచైన్ మన్ కో ఆజ్ భీ తేరీ తలాష్ హై...
ఊహ తెలిసిన నాటినుంచి నీకోసమే
ఎదురుచూసాను
చుక్కలతో మెరిసే ఆకాశంనుంచి
మిలమిలా మెరిసే ఒకతారకలా దిగివస్తావని...
ఊహలకే పరిమితమైన నువ్వు
నిజంగా లేవని తెలిసినా
ప్రతి పున్నమి వెన్నెలలో నిన్ను వెతికాను
అందమైన ఆడపిల్లలా ఆడుకుంటున్నావేమోనని...
చిన్న వయస్సులో పిచ్చి కల్పనలేమిటని లోకం నవ్వినా
భావుకతలోనే మునిగితేలాను
ఊహాసుందరి కనిపిస్తుందేమోనని...
తిరుగుతున్న గడియారం ముళ్ళ ఆదేశాలను పాటిస్తూ
క్యాలెండర్ పేజీలు  మారుతున్నా
పరిమాణాలకు నేను తలవంచినా
శోధన మానుకోలేదు
కల నిజం చేస్తూ నువ్వు వస్తావని...
అందమైన పూదోటలా ఒక పువ్వు మనసును తాకితే
పులకించిపోయింది హృదయం
నువ్వు వచ్చేసావనీ...
ఊహాసుందరి నిజమై మనసును తాకితే
రక్తం కారేదాకా తెలియలేదు
గుండెకు గుచ్చుకుంది పువ్వుకాదు ఒక ముల్లని...
నా పిచ్చికాకపోతే మరేంటి
ఊహలలో నాతో ఆడుకునే నువ్వు
నిజమై ఎలా వస్తావు...
ఒక అందమైన భావపుష్పమై
మధురమైన స్వప్నమై
నా కనురెప్పలపైనే ఉండిపో
ఎప్పటికీ నిజమై రాకు
ఒక కలగానే నువ్వు అందంగా ఉంటావు
నేను మాత్రం తుది శ్వాసదాకా
నీకోసం నిరీక్షిస్తూనే ఉంటా...

No comments:

Post a Comment