కదిలే శవం
కసి కాలం
కాటేసింది...
జీవితం ఓటమి
అంచున జారిపోయింది...
ఆంక్షల పయనం
ఇక మొదలయ్యింది...
ఇక ప్లాస్టిక్
పువ్వుల్లో
సువాసన
వెతుక్కోవాలి ...
మాటల మతాబులు
అదిమిపెట్టుకోవాలి...
గాయం గుండెను
కోస్తున్నా
చిరునవ్వులే
చిందించాలి...
తమ భావం
విడనాడి
అంతా నాదేనని
నటియించాలి...
వికసించే
మనసుకమలం
గుండెలోనే
వాడిపోవాలి...
పెదాలను దాటే
మాటలను
గొంతులోనే
పాతరేయాలి...
ఆవేశంలో
రగిలిన శాసనాలకు
తల వంచి
ప్రణమిల్లాలి ...
కనులు దాటే
కన్నీరు
రగిలే గుండెలో
ఆవిరి కావాలి...
ఆగిపోయే
శ్వాసలో
నిరాశే
ఊపిరికావాలి...
నడిరేయి
సూరీడుకోసం
కన్నులు కాయలు
చేసుకోవాలి...
ఒకరిలో ఒకరమే
అయినా
మరోకరిలా
జాగ్రత్త పడాలి...
మనసులో
స్పందనలను పూడ్చేసి
యంత్రంలా
నడపాలి...
దేహంలో
ఆత్మలను తరిమేసి
శవమై
సంచరించాలి...
అప్పుడు నేను
బతికినా చచ్చినా
ఒకటేగా
మనస్వినీ...
No comments:
Post a Comment