శ్వేత స్వప్నం
నీలి నింగి కాన్వాసుపై
తెల్లని మబ్బు రంగులు
అద్దినట్లు...
పచ్చని పుడమిపై
పాల మీగడ పరదాలు
పరిచినట్లు...
అంతా శ్వేతమే...
దివినుంచి భువికి
జాలు వారుతోంది
పాలధార...
నింగి నుంచి నేలకు
జారి
భువిని
కప్పుకుంటోంది..
ఆ అమృత ధార...
మల్లెపూల తెల్లదనం
మంచులోని స్వచ్చదనం
అన్నీ కలగలిపి
అంతా శ్వేతమయమే...
ఏం జరుగుతోందో
నేను ఎక్కడ ఉన్నానో
నాకే తెలియదు...
ఆ తెల్లదనంలో ఏదో
తెలియని కదలిక...
కన్నులు చిట్లించి
చూసాను
అవును ఏదో
కదులుతోంది..
తెల్లని మబ్బులతో
ఒంటిని సవరించుకుని
పాలమీగడ మెత్తదనంతో
సొగసులను రంగరించుకుని
ఒక ధారలా
మెరుపు తీగలా
కిందకు జారింది
ఒక మగువ..
నేలమీద నడియాడిన
జాబిలిలా
కాంతులను విరజిమ్ముతూ
సింగారాలను కురిపిస్తూ
సవ్వడి లేని సంగీతంలా
నిండు చందమామలా
నా ఎదురు నిలిచింది
ఆ ముద్దుగుమ్మ ...
కలయా నిజమా అనుకుంటూ
నన్ను నేనే
అనుమానిస్తూ
అందాన్ని అందుకోవాలని
చేతులు చాచాను ...
ఆ అందం మంచుముద్దలా
కరిగిపోయింది ...
ఆ అందం
అందని అందంగానే
తెల్లని మబ్బుల్లో
కలిసిపోయింది...
No comments:
Post a Comment