కన్నీటి వెన్నెల
కాల చక్రం ఒక్కసారి
వెనక్కి మరలితే
ఊహించుకుంటేనే ఎంత
బావుంది...
మళ్ళీ అక్కడికే
వెళ్లాలని ఉంది
అక్కడే జీవితాన్ని
ప్రారంభించాలని ఉంది...
అప్పటి జ్ఞాపకాలు ఇంకా పదిలంగానే ఉన్నాయి ...
ఆ అనుభవాలు ఇంకా మెదలుతూనే
ఉన్నాయి ...
ఇంకా బాగా గురుతు
గుప్పెడు మనసు కోసం
తపించిన ఆ హృదయం ...
ఎంత తీరికైన సమయం
ఒకరికోసం ఒకరు
కేటాయించుకున్న వైనం...
ఒక కన్ను చెమర్చితే
మరో కన్ను ఏడ్చింది...
ప్రియ వల్లభుడిని
కలుసుకోవాలనే తాపత్రయం
కారు వదిలి ఆటోలో
పరుగులు తీసిన పయనం...
ఒకరి ఊపిరి మరొకరికి
ప్రాణం పోసింది...
ఒకరు మరొకరు కాకుండా
ఇద్దరూ ఒకరుగా మిగిన
బంధం...
అనుమానమే లేని బాసలు
కల్మషమే లేని ఊసులు...
ఒకరి మనసు పుస్తకం
మరొకరికి తెరిచిన
పుస్తకం...
ముళ్ళ గులాబీలు
గుచ్చుకున్నా
మరు మల్లెలుగా
మార్చుకున్న సహకారం...
నేడు ఇద్దరూ ఒకరే
ఒక్కరే ఇద్దరు...
నాడు ఎండలో వాడినా
ప్రేమ వర్షం ప్రాణం
పోసింది...
నేడు ప్రేమ సాగరంలో
మునిగి తేలుతున్నా
కలతల తీరం అక్కున
చేర్చుకుంటోంది...
కన్నీటి వెన్నెలలో
తడిసిన
ఆ హృదయాలు
మళ్ళీ ఆ మండుటెండను
వెతుక్కుంటున్నాయి...
మండే ఎండలో మరలా
అమృతస్నానం చేయాలని
ఇరు మనసులూ
ఆరాటపడుతున్నాయి...
No comments:
Post a Comment