మరణంతో సమరం
నాకు బాగా తెలుసు
అంతిమ విజయం నీదేనని...
అయినా అలుపెరుగని
పోరాటం నాది...
నేను ఓడిపోను...
నిన్ను తేలికగా గెలవనివ్వను...
రెండు చేతులూ లేనివాళ్ళు
కాన్వాసుపై ఆటలాడితే
కాళ్ళే లేనివాళ్ళు
పరుగులే తీస్తుంటే
నాకేం తక్కువయ్యింది
ఓడిపోయేందుకు...
కళ్ళు లేని కబోది
మధుర గీతాలే ఆలపిస్తే
అన్నీ ఉన్న నేను పోరుకేక వేయలేనా...
అరచేతిలో ఇమిడిపోయే
చిన్న పిట్ట
ఆకాశాన్ని జయించలేదా
ఆ రెక్కలకంటే బలహీనమా నేను...
కంటికే కానరాని
చిరు చేప
అంతటి సముద్రాన్నే ఈదలేదా...
ఆ మొప్పలు
నా మనసుకంటే బలమైనవా...
నువ్వు నన్ను గెలిచేందుకు
తరుముతున్నావు
విజేతను కావాలనే
నేను ఎదురునిలుస్తున్నా...
నీ గెలుపు సమయం నీకు తెలుసు...
అదే నిజమని నాకూ తెలుసు...
ఓడిపోయేముందు నేను చాలా గెలవాలి...
నువ్వేం చేయగలవు నన్ను ఓడిపోయాక ...
చాలా చేయగలను నేను
ఓడిపోయేలోపే...
మరణమా నాతో గెలిచి చూడు
అంతలోనే
నిన్ను గెలుచుకుంటాను నేను...
No comments:
Post a Comment