Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday, 30 January 2016

అది నీవే

అది నీవే


కంటి కిరణం మందగమనమై
దృశ్యం అదృశ్యమై
భావం నిర్లిప్తమై
స్వప్నం కరిగిపోతున్న వేళ
అడుగులు భారమై
బాటలు మాయమై
పయనం ఆగిన వేళ
అలల సుడులను దాటినా
సునామీలను అధిగమించినా
అక్కున చేరుతున్న నావను
తీరమే విసిరికోట్టిన వేళ
మనసు మూగబోయింది
భావం కరిగిపోయింది
ఆలోచన ఆవిరైపోయింది
కనులలో గంగ జలజలా జారిపోయింది
మనసులో వేదన ఉబికి వచ్చింది
మనసంతా నిశి అలుముకుని
ఏం చేయాలో
ఎలా ముందుకు సాగాలో
అడుగులను ఎటు వేయాలో
నావను ఎలా దరి చేర్చాలో
అర్థమే కాని అయోమయం
ముభావమైన భావంలో
అర్థం లేని ఆలోచనలో
గమ్యం లేని బాటలో
చిన్న స్వాంతన కోరింది మనసు
పదే పదే కలవరించింది మనసు
మనసు కలవరింతలో
చిరు పలకరింతలో
లీలగా కదిలే రూపం
చల్లని స్వాంతన ఇచ్చే భావం
భరోసా ఇచ్చే మానసం
గమ్యం నేర్పే మార్గం
అన్నీ కలగలిపి
సంతరించుకునే రూపం
అది నీవే
మనస్వినీ

Thursday, 28 January 2016

ఎన్నెన్ని కలలో

ఎన్నెన్ని కలలో
చుక్కల నింగిని తివాచిలా పరిచి
పూలరథం ఎక్కి ఊరేగాలని ఉంది...
ఆకాశ వీధిని జయించి
రివ్వున ఎగిరే విహంగంలో దూరి
పయనించాలని ఉంది...
చందమామ వెన్నెలను దోచి
నీ ఒంటికి గంధంలా పూయాలని ఉంది..
సూరీడుని దొంగిలించి
నీ నుదుటిన బింబంలా అద్దాలని ఉంది...
మబ్బులమ్మ ను తీసుకువచ్చి
నీ ఒంటికి చీరలా చుట్టాలని ఉంది...
నిశి తెరల పరదాలపై
వెండి అక్షరాలను దిద్ది
నీపేరే రాయాలని ఉంది...
కొండరాళ్ళను బండరాళ్ళను చీల్చి
వాగులూ వంకలను దాటి
దూసుకువచ్చే సెలయేరులా
నీ ఒడిని చేరుకోవాలని ఉంది...
నీ సిగలో మల్లెలా
నీ పెదవిలో చిరునవ్వులా
విరబూయాలని ఉంది...
నా గుప్పెడు గుండెలో
ఎన్నెన్ని కలలో
కలల వరదలో ఎన్నెన్ని మలుపులో
మలుపు మలుపులో
ఎన్నెన్ని కథలో కదా
మనస్వినీ...

Wednesday, 27 January 2016

స్వప్నవేదిక

స్వప్నవేదిక

కనురెప్పల పుటలపై
ఒద్దికైన అక్షరాలు అద్దుకున్నా
సొగసైన అక్షర మాలికలతో
స్వప్నాలనే అల్లుకున్నా
నల్లని చీకటిపై
మెరుపుగీతలు గీస్తున్న
జుగ్నూలను దోసిటపట్టి
స్వప్నాలపై రంగులు దిద్దుకున్నా
ఇంద్రధనుస్సు రంగులను
మరిపించే
ప్రతి స్వప్నంలో
తేలియాడిన రంగుమేఘాలు
ఆవిష్కరించింది
నీ రూపాన్నే
కలల మబ్బులు
మలుపులు తిరుగుతూ
ఆకృతిని వీడుతూ
మరలా పొందుతూ
సంతరించుకునేదీ
నీ రూపాన్నే
అవును
ఇది నిజం
ప్రతి ఘడియలో
నిశి తెరలలో
వెలుగుల జిలుగులలో
నా కన్నులు ఎప్పుడూ
నీ స్వప్నాల వేదికలే
మనస్వినీ

Tuesday, 26 January 2016

నీవెక్కడా

నీవెక్కడా

నమ్మకమా నీవెక్కడా
ఉన్నావా నీవు ఇలలోనా
ప్రతి ఘడియలో
ప్రతి చర్యలో
నిన్నే వెతికాను
నమ్మకమా నీవున్నావా
ఒక పదంలా మిగిలిపోయావా
అన్నింటా నిన్నే శోధించా
నాలోనూ నిన్నే వెతికా
నాలో ఎక్కడా నీవు కానరాలేదు
నా మాటలో నీ ఉనికి లేదు
నా చేతలో నీ ఆనవాళ్ళు లేవు
నాలో నీవున్నావేమోనని
భ్రమలే పెంచుకున్నా
ఎక్కడ కరిగిపోయావు
ఎక్కడకు ఎగిరిపోయావు
అనుమానపు చీకటిలో కలిసిపోయావా
ఆవేశపు అగ్నిలో కరిగిపోయావా
ద్వేషమనే సునామీలో కొట్టుకుపోయావా
నువ్వు నాలోనే లేకపోతే
ఎవరిలో ఉన్నా
ఎక్కడ ఉన్నా
నాకేమి
నాలో ఎక్కడా కానరాని నమ్మకాన్ని
ఇక శోధించను
మనస్వినీ

Monday, 25 January 2016

నా మనసు నాకే తెలియదా

నా మనసు నాకే తెలియదా

నా మనసులో ఏముంది
నా మనసేం కోరుతోంది
నా మనసుకు ఏం కావాలి
నా మనసు దేన్ని ఇష్టపడుతోంది
నా మనసుకు మోదం ఎప్పుడు
నా మనసుకు ఖేదం ఎప్పుడు
నా మనసులో ప్రేమ ఎప్పుడు పుడుతుంది
నా మనసులో ద్వేషం ఎప్పుడు జనియిస్తుంది
నా మనసు కరిగేది ఎప్పుడు
నా మనసు బండబారేది ఎప్పుడు
నా మనసు నవ్వేది ఎప్పుడు
నా మనసు ఏడిచేది ఎప్పుడు
నా మనసులో ఏం జరుగుతోంది
నా మనసు నాకే తెలియదా
నా మనసు సొదలు నాకు తెలియవా
నా మనసు రోదనలు నాకు వినిపించవా
నా మనసు అంతరంగం
నా మనసు స్పందన
నా మనసు వేదన
నా మనసుకు కాక
ఇంకెవరికి  తెలుసు 
మనస్వినీ

మనసే లేకుంటే

మనసే లేకుంటే

మనసనేదే నాకు లేకుంటే
ఎంత బావుండేది
స్పందనలే నాలో లేకుంటే
ఎంత బావుండేది
మనోరహిత ఊహలు
ఊహలకే అందాన్నిస్తున్నాయి
నిజమే
నాకు మనసే లేకుంటే
ఈ వేదనల రోదనలు ఉండేవా
సుడిగుండాల సమరంలో
ఏకాకిగా మిగిలేవాడినా
మనసే లేకుంటే
చిరునవ్వుల మాటున
విషాదం దాగేనా
కంటిపొరల సునామీలో
మునకలు వేసేనా
బాధంటే ఏమిటో
మనసుకు తెలిసేనా
మనసనేదే లేకుంటే
పరాజయం నా దరిచేరేనా
మనసనేదే లేకుంటే
మనసు గోస మిగిలేనా
మనసును తెలియని మనసు
మనసును గాయం చేసేనా
మనసనేదే లేకుంటే
భావోద్వేగాలను జయించి
మరమనిషిలా
మన్ననలు పొందేవాడినేమో
కన్నీరే లేని జీవితం
నా స్వంతమయ్యేదేమో
మనస్వినీ

Saturday, 23 January 2016

నా భావం ఒక అక్షరం కాదు

నా భావం ఒక అక్షరం కాదు

మౌనమై నీవున్నప్పుడు
ముభావమే నీ భావమైనప్పుడు
సవ్వడి లేని వేళలో
చిరు సవ్వడినై
నీకురులను సుతారంగా మీటే చిరుగాలిలో
తీయని అనుభూతినై
నేను వస్తా
ఒక చిరు కవితనై
నిన్ను పలకరిస్తా
నీ పెదాలు మౌనంగానే విచ్చుకున్నా
నీ మనసు నన్ను
వికసించి పలకరిస్తుంది
నిశిని చీల్చే చల్లని వెన్నెలలో
కమ్మదనమై నిన్ను అల్లుకుంటా
ప్రభాత కిరణాల నులివెచ్చని పలకరింతలో
శుభోదయమంటూ
నుదుటిన ముద్దాడుతా
ఏకాంతం నిన్ను చుట్టుముట్టినా
మెహఫిల్ లో నీవు కేంద్రమే అయినా
అందరిలో నేనే కనిపిస్తా
వీచే గాలిలో
కురిసే వెన్నెలలో
మెరిసే ఎండలో
నీ మదిలో నేనే ఉంటా
నీ చిరునవ్వులో ముత్యమై రాలిపడేది
నా భావమే
నీ కంటి కొలనులో
జారిపడే స్వాతిముత్యం
నా అక్షరమే
ఎలా మరువగలవు
నా పదాల అల్లికలను
నా భావాల గీతికలను
నీకు నేను అంకితమిచ్చుకున్న
నా శ్వాసలో
జనియించిన భావాలు
నిత్యం నీతోనే ఉంటాయి
ఎందుకంటే
నా భావ సంకలనం
అక్షరాల సమూహం కాదు
అది నీకై నేను అల్లుకున్న
జీవన సమాహారం
మనస్వినీ

రాతిపూల తేనియ

రాతిపూల తేనియ 

మతము లేనిది
కులం వాసన పడనిది
ఆస్తులు తెలియనిది
అంతస్తుల అంతరాలు పట్టించుకోనిది
మనసు తప్ప మార్గమే లేనిది
మమతలు తప్ప లక్ష్యమే లేనిది
ముళ్ళ బాటలోనూ
పూలవాసన చూసేది
రాతిపూలలోనూ
తేనియను ఆస్వాదించేది
ఒయాసిస్సులోనూ
దప్పిక తీర్చేది
అగ్ని శిఖలు కురుస్తున్నా
మంచువానలా పులకించేది
సుడిగుండాలు చెలరేగుతున్నా
అలలనే నావగా మలుచుకునేది
ఆగుతున్న ఊపిరిలో
శ్వాసను నింపేది
మృత్యు ఘంటికలను
కాలి అందియలుగా ధరించేది
నీకు నేనున్నా
నాకు నువ్వుంటే చాలని
ముందుకు నడిపేది
అదే ప్రేమ
సమరంలోనూ వికసించే ప్రేమ
మరణంలోనూ విరాజిల్లే ప్రేమ
వసంతమే ఎదురైతే
కొత్తపుంతలు తొక్కదా
మనస్వినీ

Wednesday, 20 January 2016

అంతిమఘడియ

అంతిమఘడియ

ప్రతి దినం
ప్రతి ఘడియ
ప్రతి క్షణం
అంతిమమే
ఏ ఘడియ
ఏ మలుపు తిరుగునో
ఆదియన్నది అంతిమమేనేమో
అంతిమ ఘడియలోనూ
అంతిమ క్షణంలోనూ
జీవించాలన్నదే మనసు తపన
ఆదిలో కానరాని జీవితాన్ని
అంతిమంలో పొందాలని
మనసు ఆరాటం
సుడిగుండాలు నోరు తెరిచి
మింగేయాలని చూస్తున్నా
పూలబాటలో
ముళ్ళ తివాచీలు స్వాగతం పలుకుతున్నా
బతుకుబాటలో
నిష్క్రియాపర్వమే
తోరణాలు కట్టినా
మనసు ముందుకే సాగుతోంది
చివరి ఘడియలోనూ
నీతో జీవించాలనే
ఇంకా
శ్వాసలో ఊపిరినే నింపుకుంటున్నా
మనస్వినీ

Monday, 18 January 2016

మనస్విని అంటే

మనస్విని అంటే

మొగ్గ తొడిగిన ఊహకు ప్రతిరూపం
నా మనస్విని
ఊహాసుందరి నృత్య భంగిమలో
రాలిపడిన మంజీరం
నా మనస్విని
చల్లని పవనంలో
తనువును ముద్దాడిన సమీరం
నా మనస్విని
జవరాలి కంటి కొనలనుంచి
జాలువారిన వెన్నెలమ్మ
నా మనస్విని
గుండెను తాకిన గులాబిలో
గుచ్చుకున్న ముల్లును
ముద్దాడిన రుధిరం
నా మనస్విని
తడబడిన అడుగులకు
నడక నేర్పిన బాటసారి
నా మనస్విని
ఓయాసిస్సులోనూ దప్పిక తీర్చిన
తీయని పలుకుల తేనెలమ్మ
నా మనస్విని
భావోద్వేగాల సమరంలో
ఉబికివచ్చిన ఆవేశం
నా మనస్విని
గుండె లోతుల్లో
ఎగసిపడే కెరటం
నా మనస్విని
గుండె కథలకు
మనసు వ్యధలకు ఆధారం
నా మనస్విని
జీవన గమనానికి
అంతిమ శ్వాసకు మూలం
నా మనస్విని
నా జీవం
నా హాస్యం
నా వేదనం అన్నీ
నా మనస్విని
గాలిలో పుట్టిన అక్షరాల సమూహం కాదు
నా మనస్విని
దేహాన్ని నడిపే
హృదయంలో స్పందనే
నా మనస్విని
మనస్విని మాటకు విలువ తెలియాలంటే
మనసు లోతులను చూడగలగాలి
మనస్వినీ