Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Sunday, 31 May 2015

చివరి ప్రేమలేఖ

చివరి ప్రేమలేఖ

రాస్తున్నా గుండె దిటవు చేసుకుని
అక్షరాలు చిలికిస్తున్నా మనసు చంపుకుని

భావాల అంతరంగాన్ని అంతం చేసాను
అక్షరాల గొంతు నులిమేసాను

ఇక నా అక్షరం పలకదు నీ నామాన్ని
నా భావం వెల్లడించదు తనలోని ప్రేమని

నా కలంలో ప్రేమ సిరా ఇంకిపోయింది
అక్షరాల రంగు మారిపోయింది
భావాల గుండె పగిలిపోయింది

నా అక్షరామాలిక
పరిమళం లేని పుష్పంలా మారింది

శ్వాస ఆగిన అక్షరాలు నీకు ప్రణమిల్లుతున్నాయి
గుండె పగిలిన భావాలు పుడమిని ముద్దాడుతున్నాయి

సునామీల వెల్లువకు నా గుండె చెదిరి
అక్షరాలన్నీ చెల్లా చెదురై వీడిపోతున్నాయి

కాలగమనంలో అవి కొట్టుకుపోతున్నాయి
ఇక తిరిగిరావు నా భావాలు

పరిమళించవు నా అక్షరాలు
ఓడిపోయాయి అంతరంగాలు

పగిలిన మనసులో విరిగిన అక్షరాలు
నవలోకానికై సాగిపోతున్నాయి

ఇక రానే రామంటూ
చెదిరిన మనసుకు వీడ్కోలు చెబుతున్నాయి

విరిగిన అక్షరాలను
ముక్కలైన భావాలను
కన్నీటితో అతికించి
రాసుకుంటున్నా
చివరి ప్రేమ లేఖ

నాదన్నది ఏమున్నది నీలో

నాదన్నది ఏమున్నది నీలో


ఆలి లోని అనురాగం నీలోనే తెలుసుకున్నా
ప్రియురాలి మధురిమ నీలోనే రుచి చూసా

అమ్మలోని మమకారం నీ ఓడిలోనీ వెతుక్కున్నా
స్నేహమనే సహకారం నీతోనే పంచుకున్నా

పసిబిడ్డ కేరింతలు నీ నవ్వులోనే చూసుకున్నా
కవ్వించే కొంటెదనం ఆ కన్నులలోనే దాచుకున్నా

అమ్మవై గోరుముద్దలు తినిపించినా
ఆలివై అనురాగం పంచినా

జవరాలివై అధరామృతాలు అందించినా
ప్రియురాలివై సర్వమూ ధారపోసినా

అన్నీ నావే అనుకున్నా
సర్వమూ నేనే అనుకున్నా

నాజీవనవనంలో
అందమైన పూదోటవే అనుకున్నా

నాదన్నది ఏదీ లేదని
ఇప్పుడు తెలుసుకున్నా

నీకన్నులలో నేను కరిగిన కలనేననీ
నీ మనసులో నేను లేనే లేనని అర్ధం చేసుకున్నా

నేను నీలో లేకున్నా
నేను నీకేమీ కాకున్నా

నీ జ్ఞాపకాలు మాత్రం పదిలంగానే ఉంటాయి
నా గుండెలో

నాది కాని మనసుకోసం కలత చెందను
గీసిన గీత హద్దు దాటను

అంతిమ ఘడియలు నన్ను చుట్టుముట్టినా
ఆ మనసును పలకరించను

చాలవా నాకు ఆ జ్ఞాపకాలు
ఊపిరిపోసుకోవటానికి

Saturday, 30 May 2015

పులి సాదు జంతువే

పులి సాదు జంతువే

మాంసం లేనిదే పొట్ట నిండని పులి సాదు జంతువే
అడవిలోనున్న పులి పిల్లను పెంచుకుని చూడు
గడ్డి పరకలు తింటూ పిల్లిలా నీ వెంట తిరుగుతుంది
తల నిండా విషమున్న కాలనాగులోనూ విషయముంది
తన విషంలోనే విరుగుడు దాచి నీకు ప్రాణం పోస్తుంది
ఆలోచనే లేని పులి భయంతోనే దాడి చేస్తుంది
కాలనాగునైనా కదిలిస్తేనే బుస కొడుతుంది
క్రూరంగా కనిపించే పులులూ సింహాలు
పంజా విసిరినా అది ప్రకృతి ధర్మం
కోడె నాగు పడగ విప్పినా
అది దాని అణువణువునా నిండి ఉన్న భయం
మరి మనిషి
ఆధునిక కాల చక్రానికి దర్పణం
సంఘజీవనానికి నిదర్శనం
మనిషికి మెదడు నిండా ఆలోచనలున్నా
మంచీ చెడూ జ్ఞానమున్నా
మనసు నిండా విషమే
పాము భయంతో కాటు వేస్తే
మనషి స్వార్ధంతో కాటు వేస్తున్నాడు
కప్పను మింగిన పాము కడుపు నిండిందని నిదురిస్తే
అన్నీ ఉన్నా ఇంకా కావాలని మనిషి కాటు వేస్తున్నాడు
ప్రేమలో విషం
కురిసే మమతల వర్షంలో విషం
ఆలుమగల అనురాగంలో విషం
అన్నదమ్ముల అనుబంధంలో విషం
స్నేహమనే ముసుగు విషం
ఆదుకుంటామని ముందుకు వచ్చే మనిషిలో విషం
నడకలో విషం
నడతలో విషం
మూగజీవులు ఇతర జాతులపై దాడి చేస్తే
ఆధునిక మనిషి ఆది మానవుడై
సొంత జాతిపైనే చిమ్ముతున్నాడు విషం
మరి ఎవరు క్రూర జంతువు
ఆ మూగ జీవాలా
అన్నీ ఉన్నా
ఆశ చావని మనిషా
నిజమే కదూ
పాము మనకు మంచి నేస్తమే
పులి సాదు జంతువే

మట్టి మనసు

మట్టి మనసు

కళ్ళ ముందు చికెన్ బిర్యానీ
పప్పన్నం ఎలా రుచిస్తుంది
ఫారిన్ విస్కీ లాగించే మనిషికి
నాటుసారా ఎలా నచ్చుతుంది
సిరి సంపదల మనసుకు
ఖాళీ పర్సు ఎలా కనిపిస్తుంది
హంసతూలికా తల్పం అలవడిన దేహానికి
చిరిగిన చాప సుఖమేమిస్తుంది
బెంజికార్ల బాటసారికి
కాలి నడక ఎందుకు కనిపిస్తుంది
పచ్చనోటు ఆరగించే వాడికి
చిల్లర నాణం ఎలా అరుగుతుంది
ఊహల రెక్కలు విచ్చిన మనసుకు
మట్టివాసన ఎలా నచ్చుతుంది
పరులంతా అబద్దమని భ్రమించే మనసుకి
నిజమెలాగుంటుందో ఎలా తెలుస్తుంది
మనసా ఇదే లోకం పోకడ
ఇలాగే ఉంటుంది ఇక్కడ
నీ స్థాయి తెలుసుకుని మసులుకో
మట్టిలో పుట్టిన నీవు
మట్టిమనిశిగానే ఆలోచించు
ఆకాశంలో విహరించినా
చివరకు ముద్దాదాల్సింది మట్టినే
మనసా
మట్టి మనిషిగానే మిగిలిపో

Friday, 29 May 2015

జ్ఞాపకాల సమాధి


జ్ఞాపకాల సమాధి


మరలా తట్టు తగిలింది
తట్టు మీద తట్టు తగులుతూనే ఉంది

కన్నులు ఉన్నా కబోధినే నేను
తప్పుటడుగులు వేస్తూనే ఉన్నా

గోడకు తగిలిన బంతిలా
మరలా అక్కడకే చేరుతున్నా

బుద్ది రాదు మనసుకు
నడక రాదు అడుగులకు

మెదడు నిండా ఆలోచనలున్నా
మనసు మాటే నెగ్గుతోంది
ఆ మనసే భంగపడుతోంది

చంపుకుంటా నా మనసును
నడక నేర్పుతా నా అడుగులకు

తిరగ రాస్తా బంతి చరితను
సమాధి చేస్తా అంతరంగమును

పూలబాట తెలియకున్నా
ముళ్ళ బాటను చెరిపివేస్తా

గుండెనిండా తిరస్కరిస్తున్నా
ఆ మనసును

కన్నీటి సుడులలోనే దాచుకుంటా
మిగిలిఉన్న జ్ఞాపకాలను

ఇక నా మనసు మారదు
మనస్వినీ

నీ రాతనే మార్చి వేస్తా

నీ రాతనే మార్చి వేస్తా

ఏక్ మౌఖా దే మౌలా తేరీ తక్దీర్ బదల్ దూంగా
తేరీ లిఖీ హర్ లఖీర్ మిటాదూంగా
నుదుటిన గీసిన గీతలు
పెనవేసుకున్నాయి
నువ్వురాసిన రాతలు అర్థాలు మార్చుకున్నాయి
పెనవేసుకున్న గీతలు
కొత్త చరిత్రనే రాసుకున్నాయి
ఎవరు పుట్టారు జగతిలో
నన్ను మోసం చేసేందుకు
ఎవరికిచ్చావు అంత తెలివి
నన్ను ముంచేందుకు
ఎవరికంత సత్తా ఉంది నన్ను చంపేందుకు
నన్ను నేను మోసం చేసుకున్నా
నన్ను నేనే చంపుకున్నా
నా అడుగుల జాడలు నేనే చెరుపుకున్నా
నా బాటలో నేనే ముళ్ళు పరుచుకున్నా
ఎందుకు నిందించాలి ఎవరినో
నన్ను నేనే ముంచుకున్నా
ప్రతి ఎత్తుకు నేనే చిత్తు వేసుకున్నా
గెలుపు గమ్యాన్ని నేనే మార్చుకున్నా
ఓటమి దిశను నేనే ఎంచుకున్నా
ఒకే ఒక్క అవకాశం కావాలి నాకు
విజేతనై మిగిలిపోతా
దేవుడా
ఒకే ఒక్క అవకాశమివ్వు
నీ రాతనే మార్చి వేస్తా

Thursday, 28 May 2015

మనసెందుకు ఇచ్చావ్

మనసెందుకు ఇచ్చావ్

ఆ దేహం
ఆ నడక
ఆ పలుకు
ఆ మనసూ నాదేనని
మారాం చేస్తుంది నా మనసు
అందుకే ఆ మనసు కోసం
నా మనసు తాపత్రయం
ఎక్కడుంది
ఎలా ఉంది
ఎప్పుడు వస్తుంది
అంటూ ఆరాలు తీస్తుంది నా మనసు
క్షణం ప్రతిక్షణం
పరితపిస్తుంది నా మనసు
పూలబాట పరువలేకున్నా
ముళ్ళు గుచ్చుకోకుండా ఉంటే చాలని
ఎడదను పరుస్తుంది నా మనసు
మనసు ఆరాటాన్ని తప్పుగానే చూస్తుంది
ఆ మనసు
పలకరించకుంటే ముభావమని అంటుంది
పలకరిస్తే ఇదేమని ప్రశ్నిస్తుంది
మనసు వేదనను స్వీకరించని మనసు
వేధింపులేల అని అడుగుతోంది
భగవాన్
నాకు మనసెందుకు ఇచ్చావ్

Wednesday, 27 May 2015

మార్గం తెలియని అడుగులు

మార్గం తెలియని అడుగులు

మనసు నిండా నిర్వేదం
కనులనిండా సుడిగుండం
కనుచూపుమేరలో కనిపించని గమ్యం
ఇక చాలునంటున్నది జీవనం
నడవలేనని మారాం చేస్తొంది దేహం
తప్పులన్నీ నావేనని నిందిస్తోంది లోకం
అనుభవించు అంటున్నది మానసం
పరిణామాలన్నీ విపరిణామాలై
కసినాగులా కాటేస్తూ ఉంటే
నమ్మిన మనసు ఉప్పెనలే ఎగదోస్తూ ఉంటే
విధిలేక వేసిన అడుగులు
పిడిబాకులై గుచ్చుకుంటూ ఉంటే
మనసు వేదనను పసిగట్టని మనుషులు
పరిహాసమాడుతూ ఉంటే
ఇక ఓపలేనని రోధిస్తోంది హృదయం
నలుదిక్కులా నిశి అలుముకుని
అన్ని మార్గాలూ మూసుకుని
మార్గమే తెలియని అడుగులు
ఒక్క చోటే నిలబడిపోయినా
ముందుకు సాగాలనే ఆశ చావలేదు
జీవించాలనే తపన ఆగలేదు
సాధ్యం కాదని తెలిసినా

Tuesday, 26 May 2015

దేవుడు చేసిన తప్పులు

దేవుడు చేసిన తప్పులు

అర్హత లేని వారిని అందలాలు ఎక్కించావు
అర్హత ఉన్నవాడిని పాతాళంలోకి విసిరేసావు
మనసున్న మనిషికి సుఖమే లేకుండా చేసావ్
మనసంటే తెలియని వాడికి స్వర్గాన్నే అందించావు
గొప్పోళ్ళు ఏం చేసినా తప్పే కాదన్నావు
లేనివాడు మంచి చేసినా నేరమనే రుజువు చేసావు
ఉన్నవాడికే అన్నీ ఇస్తూ నీరు పల్లమెరుగు అన్నావు
లేనివాడిని నిత్యం ఆకలితో చంపావు
దరిద్రుడు ప్రేమిస్తే అపరాధమే అన్నావు
గొప్పోళ్ళు విలువల వలువలు విసిరేస్తే అదే న్యాయమని అన్నావు
గతిలేక పిల్లలను పోషించలేక పోతే చేతకాని వాడని అన్నావు
మదమెక్కి పిల్లలను గాలికి వదిలే వాళ్ళను నాగరీకులన్నావు
మొగుడు పెళ్ళాన్ని వదిలేస్తే కిరాతకుడన్నావు
భార్యే భర్తను వదిలేస్తే వీరనారి అంటూ జేజేలు పలికించావు
ఆడది ఆబల కాదు సబల అంటూనే
ముదితలకు నరకం చూపిస్తున్నావు
అన్నకు తమ్ముడు కాకుండా చేసావు
భార్యకు భర్తకు తగాదాలు పెట్టావు
మనసులను మాయం చేసి తనువుల అంగడి నడిపావు
ధర్మమే గెలుస్తుందని రాతలు రాసుకుంటూ
అసురులనే గెలిపిస్తావు
ఇన్ని తప్పులు ఎలా చేసావు
అందరి తలరాతలు రాసే నువ్వే ఇన్ని తప్పులు చేస్తే
ఇంకా నువ్వెందుకు నీ పాలన ఎందుకు
దేవుడా నీ తప్పులు సవరించుకో

Monday, 25 May 2015

ప్రాచీన శిలాజం ప్రేమ...

ప్రాచీన శిలాజం ప్రేమ...

స్వార్ధమనే విష కౌగిలిలో కరిగి పోయింది
కక్షలు కార్పణ్యాలలో రగిలిపోయింది
కుట్రలు కుతంత్రాలలో వాడిపోయింది
అనుమానాల అవమానంలో వాడిపోయింది
అబద్దాల నగరిలో దారి తప్పిపోయింది
విషనాగుల పరీక్షలో ఓడిపోయింది
రెండు అక్షరాల ప్లాస్టిక్ పువ్వులా మిగిలిపోయింది
కలవలేని మనసులను కలిపేసాననుకున్నది
కల్మశమే ఒంటికి రుద్దుకుని మలినమైపోయింది
తాను లేకున్నా ఉన్నానని మురిపించింది
మనసు నేత్రంలో ఉనికే కోల్పోయింది
సిరుల బందీఖానాలో ఊపిరి విడిచింది
చివరకు ఒక ప్రాచీన శిలాజంగా
మిగిలిపోయింది ప్రేమ....

Sunday, 24 May 2015

భయమేస్తోంది మనసా

భయమేస్తోంది మనసా

ఏదో తెలియని భయం
ఏమూలనో అంతు చిక్కని కలవరం

ఏం జరగనుందోనని అలజడి
మనసు మూలలో ఎందుకో ప్రకంపనలు

కడిగిన మేలిమి ముత్యం నా మానసం
ఎంతో నమ్మకమైనది నా హృదయం

అందరినీ నమ్మేస్తుంది ఆ మనసు నిత్యం
మనసు నమ్మకంపై నాకూ అంతే నమ్మకం

సమాజంపైనే లేదు నాకు నమ్మకం
విషనాగుల నిలయం ఈ సమాజం

తన చింతన లేనిదే చేయూతనివ్వని వైనం
సొంత మేలు లేనిదే కొంత మేలు చేయని వ్యవహారం
మేకవన్నె పులులకు ఇది ఆవాసం

ఎందుకో మనసా
స్నేహమనే ముసుగుల పలకరింతలను
నమ్మదు నా మనసు

ఎవరి స్వార్ధం వారిదే
ఎవరి ఆరాటం వారిదే

మనసు పోరాటం మనసుదే
నా మనసే గెలవాలని
మనసు కోరుకుంటున్నా
ఎందుకో
భయమేస్తోంది మనసా