Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 8 May 2015

జిందగీకా నాం దోస్తీ...

జిందగీకా నాం దోస్తీ...



రక్త సంబంధం ఆర్ధిక మూలాలు వెతుకుతోంది
పడిపోయిన వాడిని లేపేందుకు లెక్కలు వేస్తోంది...
నిత్యం సలాము చేస్తూ గులాములమని నటియించిన
బంధుగణం రాబందుల రాజ్యం అయ్యింది...
సలాము చేసిన కరములు
వేలెత్తి గేలి చేస్తున్నాయి...
సహాయమే పొందిన మనుషులు
నిస్సహాయులై నిలిచారు...
ఆదుకుంటామని ముందుకు వచ్చిన శాల్తీలు
తమ స్వార్ధమే చూసుకున్నాయి...
నేనింత ఇస్తే నాకెంత
అంటూ వ్యాపారం చేశాయి...
అడుగుల జాడలు మేమే అన్న మనసులు
ఎండలో నీడలా కరిగిపోయాయి...
ప్రతి పదం భారమైన వేళలో
గమనం చీకటైన తరుణంలో
మనసును చదవటం తప్ప
వ్యాపారమే తెలియని రెండు మనసులు
చేయూతగా నిలిచాయి...
జీవితాన్ని నిలపలేకున్నా
ఊపిరికి శ్వాసనే అందించాయి...
బంధాలూ బంధనాలూ
అపహాస్యంగా మారినా
మమతలూ మనసులూ
మమకారాన్ని మరిచిపోయినా
ఏ బంధమూ లేని రెండు మనసులు
మేమున్నామని అభయహస్తం ఇచ్చాయి...
ఎవరన్నారు ఈ లోకంలో స్నేహం ఒక మోసమని
నా ఇద్దరు మిత్రుల రూపంలో
నా స్నేహం ప్రతి అడుగులో నాకు తోడుగానే ఉంది...
ఆఫీసులో కలుసుకున్నా
రోడ్డుమీద ఎదురైనా
ఇరానీ హోటల్ లో చాయ్ తాగుతున్నా
వారి చర్చ స్నేహితుడే...
లక్షలు కాదు కావాల్సింది
ఒక ఓదార్పు
ఒక గమ్యం
అదే ఆ ఇద్దరి స్నేహం...
లక్ష్యం గురి తప్పినా
గమ్యం ఎండ మావిలో కలిసిపోయినా
గెలిచినా ఓడినా
ఆ స్నేహాన్ని మాత్రం మరువదు మనసు...
ఇద్దరు మిత్రుల మనోస్పందనకు
నిత్యం ప్రణమిల్లుతుంది మనసు...

No comments:

Post a Comment