Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Monday, 29 June 2015

దరి చేరని మనసులు

దరి చేరని మనసులు

మనసు చుట్టూ భయం మబ్బులు కమ్ముకున్నాయి
పుడమి చుట్టూ తెల్లని మేఘాలు అల్లుకున్నట్లు
మనోసంద్రం ఇంకిపోయింది
కడలి కెరటాలు వెనక్కి మరలినట్లు
ఏదో తెలియని భయం కమ్ముకుంది మనసును
ఏదో తెలియని నిస్తేజం ఆవరించింది మదిని
మంతనమాడిన మనసు
మూగనోము పట్టింది
పులకరించిన మనసు
వాడిన పువ్వును తలపిస్తోంది
కలలు కరిగిన కన్నులు
కలుసుకోలేకపోతున్నాయి
వెన్నెల నెలవులు నయనాలు
ఎండమావులుగా మారుతున్నాయి
ఆవిరవుతున్న వెన్నెలలో
గుడ్డి దీపాలే అవుతున్నాయి
మనసు పాటలు పాడిన పెదాలు
శృతి లయలనే మరిచిపోయాయి
నువ్వూ నేనూ అని పలకరించిన మనసులు
లేని గౌరవాన్ని సంతరించుకున్నాయి
దూరమైనా దగ్గర కాలేని మనసులు
చేరువైనా దూరాలనే కొలుస్తున్నాయి
దరి చేరే ఆరాటం తరిగిన మనసులు
పంచన చేరేందుకు
భేషజాల ముసుగును కప్పుకున్నాయి
అది దూరమో చేరువో తెలియక
భయం మబ్బులు
కన్నీటి వానగా కురుస్తున్నాయి

Sunday, 28 June 2015

మనసు సమాధి

మనసు సమాధి

ఏదో తెలియని భావన
నిర్వికారమైన వేదన
శూన్యంలో మూగ రోదన
మనసునుంచి మనసు
మాయమైన యాతన
పరిమళించిన మనసు
ముడుచుకుపోయిన వైనం
ఏమయ్యిందో తెలియని భావం
మనసులో మథనం నిలిచిపోయిందా
మనసులో భావాలే ఆవిరైపోయాయా
ఎగసిపడే కెరటాలు
ఒక్కసారిగా కుప్పకూలిపోయాయా
అలల సంద్రం మానసం
నిశ్చల నిర్జీవ తటాకమేనా
ఏదో అయ్యింది మనసుకు
ఎక్కడో గాయం తగిలింది మనసుకు
మనసు మనసు విప్పలేకపోతోంది
మనసున గాయం చూపలేకపోతోంది
పునాదులు వేసిన గాయంలోనే
మనసు తనను తాను
సమాధి చేసుకుంటున్నది

Thursday, 25 June 2015

అది ప్రేమే

అది ప్రేమే

బంధనాల్లోనూ
పులకించెను నా మనసు
ఆంక్షల శాసనంలోనూ
పరిమళించెను నా హృదయం
నీ కనుసన్నలలో
పురివిప్పెను నా భావం
అవును మనసా
మనసు ఆవేదన తెలుసు నాకు
ఆ మదిలో సుడులు తిరిగే ఆరాటం
తెలుసు నాకు
నాదన్నది నాదే మరెవ్వరిదీ కాదనే
తపన తెలుసు నాకు
పువ్వు వంటి మనసుతో సావాసం చేస్తున్న నేను
నా చుట్టూ పువ్వులాంటి ముళ్ళు కూడా
ఉన్నాయనీ తెలుసు నాకు
పువ్వు పరిమళం నాతోనే ఉన్నప్పుడు
గుచ్చుకునే ముళ్ళు ఎందుకు నాకు
నన్ను ప్రశ్నించే మనసులోని
అంతరం తెలుసు నాకు
అది అనుమానం కాదు
అభిమానమనీ తెలుసు నాకు
నీ పలుకులు మార్గ దర్శకాలే
తెలుసుకుంటే ఇదే నిజం నాకు
ప్రేమ ఉన్న చోటే
అనుమానమూ ఉందని
నీకు మాత్రం తెలియనిదా
మనస్వినీ

Sunday, 21 June 2015

ఆరాధకులెందరో ఆస్వాదకుడు ఒకరే

ఆరాధకులెందరో ఆస్వాదకుడు ఒకరే

ఆ తీయని పలుకుల మధురం ఎందరికో ఇష్టం
ఆ పెదాల మెరుపులు అందరికీ ప్రమోదం
ఆ కన్నుల వెన్నెలలో ఆడుకోవాలని ఎందరికో తాపత్రయం
తీయని స్వరంతో స్వరం కలపాలని కొందరు ఆశిస్తే
పెదాల మెరుపుల్లో పునీతం కావాలని మరికొందరు
ఒకరు భావకులై పదాలను అల్లుకుంటే
మరుజన్మంటూ ఉంటేనని
ఆశల పందిళ్ళు మరోకరివి
కన్నులవెన్నెలలో సరిగంగ స్నానాలాడాలని
ఉబలాటపడేది మరో హృదయం
ఒక్కసారన్నా ఆకర్షించాలని మరో మనసు ఆరాటం
సహజమైన స్వగతమిది
నిత్యం జరిగే మథనమిది
అందంగా ఉంటుంది గులాబీ
అది దాని జన్మ ఫలం
తీయగా పాడుతుంది కోయిల
అది దేవుడిచ్చిన వరం
అందానికి భాష్యం ఆ అందమే
తీయని రాగానికి ఆలవాలం ఆ స్వరమే
చందమామకు ప్రతిబింబం ఆ వదనమే
నెమలి నడకకు నడత నేర్పీది ఆ లాస్యమే
ఆ అందాన్ని అభిమానించటం సహజ గుణం
ఆరాధించటం అర్ధవంతం
ఆరాధకులెందరో ఉన్నా
ఆస్వాదకుడు ఒకరే
ఇదే నిత్య సత్యం

Friday, 19 June 2015

శిలగా మిగిలిపోనా కలగా కరిగిపోనా

శిలగా మిగిలిపోనా కలగా కరిగిపోనా

గతించిన జ్ఞాపకాల ఆనవాళ్ళు
అడుగుజాడలుగా నడుస్తున్నాయి
ప్రతి అడుగులో ఆ అనుభవాలు
నా కంటే ముందే ఉంటున్నాయి
వెక్కిరిస్తున్న ఆనవాళ్ళు
కాళ్ళకు బంధనాలు వేస్తున్నాయి
ఏ దిక్కులకు చూపు సారించినా
మార్గాలను మూసేసి హేళన చేస్తున్నాయి
మనసు పయనంలో గతం
స్వగతంలా వెన్నాడుతూనే ఉంది
మనసులో మనసే లేని వైనం
శూలమై దిగబడుతూనే ఉంది
చేతగాని మనసుతనం
మరుగుజ్జులా మార్చేస్తోంది
ఎన్నటికీ అందని ఆకాశం
నేను చేదే నీకంటూ కొంటెనవ్వులు విసురుతోంది
అందలాలు కోరుకోని నా మనసు
కాసింత చోటడిగింది
సూదిమొనకూ కొరగావంటూ
మనసు కుండబద్దలు కొట్టింది
గతించిన జ్ఞాపకాల వెల్లువ
సుడిగాలిలా చుడుతుంటే
గతవైభవపు శిథిలాలు
ఏవీ నీ రాచరికాలంటూ పరిహాసమాడుతూ ఉంటే
ఎలా కదులుతాయి అడుగులు
ఎక్కడ మిగులుతాయి జాడలు
శిలగా మిగిలిన నేను
ఒక కలగా కరిగిపోనా
మనస్వినీ

నా మనసు నా ఇష్టం

నా మనసు నా ఇష్టం

జనారణ్య రోదనలో
పొగ ధూళి మేఘాలలో
వాయువేగంతో దూసుకుపోతున్న వాహనాలు
రోడ్డు దాటుతున్నావు నీవు
వాహన వలయాన్ని ఛేదించుకుంటూ
వడి వడి అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నావు
నీతో నడుస్తున్నాను నేను
అప్రయత్నంగానే
నా చెయ్యి నీ చేయ్యినందుకుంది
నా చెయ్యి పట్టుకోవటం అవసరమా అని
నీలో నీవే గొణుగుతున్నా
ఆ మాటలు నాకు వినిపిస్తూనే ఉన్నాయి
అవును నాకు అవసరమే
నీవు ధీర వనితవైనా
ఓ సామ్రాజ్యానికి అధినేత్రివైనా
కష్టాల కడలిని దాటే వీరనారివైనా
అబలను కాదు సబలనే అనుకున్నా
నా మనసుకు బేలవే
నా కన్నులకు ఓ అందమైన పూరెమ్మవే
నాకు అవసరంముంది నీ క్షేమం
నా మనసు కోరుకుంటుంది నీతో పయనం
అందుకే నా చెయ్యికి మనసే చెప్పిందేమో
నీ చెయ్యిని అందుకొమ్మని
నీకు నేను ఏమీ కాకున్నా
అందరిలాగే నేనూ అన్నా
అందరిలో ఒకడినే అయినా
నువ్వు నాకు ప్రత్యేకమే
నీవు నాకు అందరిలో నువ్వు కాదు
ఎందరిలోనో నీవు లేవు
మరెక్కడో నీవు లేవు
నిత్యం నా ఊపిరిలో ఉండే నీకు
నేను అర్థం కాకపోవచ్చు
నా బలహీనతలు నీ కనులకు పరదాలు తొడగవచ్చు
నీవు కించపరిచినా
ద్వేషించినా
మనోపాతాళంలో పాతి పెట్టినా
నేనేమీ చేయలేకున్నా
నీ గురించే ఆలోచిస్తా
నిన్నే మనసులో నింపుకుంటా
నా మనసు నా ఇష్టం

Thursday, 18 June 2015

గుంపులో గోవిందయ్య

గుంపులో గోవిందయ్య

నేనెందుకు ప్రత్యేకం
అందరిలో లేనిది నాలో ఏమున్నది
నాలో లేనిది పరులలో ఏమున్నది
అందరిలాగానే నేను
అందరిలోనూ నేను
అందరిలాగే ఆలోచిస్తాను
అందరిలాగే కనిపిస్తాను
అందరిలాగే చూస్తాను
మరెందుకు నేను ప్రత్యేకం
ఎందుకు కావాలి నేనే కేంద్రం
నా ఆలోచనలో మార్పు ఉందా
నా నడకలో
నా నడతలో తేడా ఉందా
నేనేంటో నాకే తెలియదా
ఇతరుల విలువ నాకు తెలియదా
నా విలువను నేనే పెంచుకున్నానా
భ్రమలే జీవన బాటలుగా ఎంచుకున్నానా
నిజాలకు చెరువే కాలేనా
ఏమున్నది నాలో తేడా
అందుకే అందరిలాగానే నేను
అందరిలోనూ నేను
అవును నేను
గుంపులో గోవిందయ్యను

Wednesday, 17 June 2015

మనసా మన్నించవే

మనసా మన్నించవే

ఒంటరి మనసు నీది
ఆ మనసులో అంతుచిక్కని వేదన ఉంది

మెరుపులు చిమ్మే పెదాల మాటున
తీయని పలుకుల్లో ఏదో తెలియని నిర్వేదం ఉంది

వెన్నెల కురిపించే నీ కను రెప్పల మాటున
ఎవరికీ తెలియని కన్నీటి సంద్రం ఉంది

చిరాకు పుట్టించే నీ చేష్టలు
ఆ చేష్టల వెనుక అంతుపట్టని అంతరంగం ఉంది

ఊగిపోయే ఆవేశం నీది
ఆవేశం మాటున ఒక అర్ధం ఉంది

నా మనసును నొప్పించే నీ పలుకుల్లో
నిఖార్సైన నిజం దాగి ఉంది

నాకు తెలుసు నీ మనసు వేదన
నా మనసుకు తెలుసు నీ రోదన

కడగండ్ల మనసులోని అంతరంగం
నా మనసు అంతరాలకు తెలుసు

స్వాంతన కల్పించాలని
నా మనసూ కోరుకుంటోంది

చేతకానిదైన నా మనసు
నిస్తేజమై చూస్తోంది

కష్టాల కొలిమిలో రగులుతున్న నా మనసు
దిక్కులేనిదయ్యింది

ప్రగతిబాటలో అడుగులజాడలు
వదిలిన మనసుకు బాసట ఇవ్వలేకున్నది

నీ మనసు మంటకు బీజం వేసిన నా మనసు
సిగ్గుతో తలదించుకుంటున్నది

భారమైన నా మనసు
నీ వేదనకు చేయూతనివ్వక
మౌనంగానే
ప్రణమిల్లుతున్నది

మన్నించు మనస్వినీ అనుకుంటూ
మూగగా రోదిస్తున్నది

Tuesday, 16 June 2015

నిశ్శబ్దగీతిక

నిశ్శబ్దగీతిక

నిన్నటి జ్ఞాపకం ఒక మంచు మేఘమై
జడివానలు కురిపిస్తుంటే
ఒక్కో చినుకూ
నాటి అనుభూతుల చితిమంటలను తలపిస్తుంటే
రగులుతున్న బిందువుల మంటలకు
దేహంలోని ఒక్కో అంగం రాలిపోతుంటే
కరిగిపోయిన నా కలలన్నీ
వరదలై ప్రవహిస్తూ ఉంటే
ఏమీ చేయలేక
వరదను ఆపే తరం లేక
నిలిచిపోయాను ఒక స్వప్నంలా
పొంగి పొరలిన స్వాప్నిక చినుకులు
నాపైనే పగబట్టి
రగిలిన వేదనల పొగలో ఆవిరిగా మారి
మరో నల్ల మబ్బులా మారి
మరలా కురుస్తూ ఉంటే
నా దేహం సమస్తం
కరిగి పోయింది మంచు ముద్దలా
నేనున్నానో లేదో
నేను నేను కాదో అవునో
తెలియని అచేతన స్థితిలో
మిగిలిపోయాను
నిశ్శబ్ద గీతికలా

Monday, 15 June 2015

మనసే లేని మనిషిని

మనసే లేని మనిషిని

పరిణామక్రమంలో ప్రతికూలతలను
ఛేదించి రూపాంతరం చెందిన
మట్టిజీవిని
భారమైన మనసు రూపాన్ని
త్యజించిన మంచు దేహాన్ని
మనసు నుంచి మనిషిగా మారిన
శిథిల శిలాజాన్ని
మనసు రుచిని మరిచిన
బండనాలుకని
మనసు గోసను మనసుతో
చూడవద్దని శాసించుకున్న మరమనిషిని
కనులు రెండు ఉన్నా
దృశ్యాన్ని విసర్జించిన కబోదిని
తీయనిపలుకులను విసిరిపారేసి
చెవులను నిండిన సీసాన్ని
మనసే లేని దేహం
మనిషిగానే నడుస్తుంది
ఏ మనసెలా మెసిలినా
మనిషిగానే మసులుకుంటుంది
నింగితారకలు నేలను ముద్దాడినా
నిశి తెరలను తొలగించదు నా నయనం
ఇక మనసు వైపు నడవదు నా గమ్యం
మనసుకు మనసుతో లేదు ఇక బంధం
మనసునూ మనిషిగానే చూస్తా ఇక నిత్యం
మనిషిగానే పుట్టిన మట్టి పురుగుని
మనసు ముసుగు తొడుక్కున్న మామూలు జీవిని
కాలంతో మారిన సగటు మనిషిని
మనసును పాతరేసి మారిన మనిషిని
మనసే లేకపోతే మమతలెందుకు
మమతలు లేని మనసు ఏమైతే ఎందుకు
నాలో మనసుంటేగా మరో మనసు గోస
మనసు కుంపటి ఆరిపోయి
చల్లారిన నిర్జీవిని

Sunday, 14 June 2015

నవ ప్రస్థానం

నవ ప్రస్థానం

పగుళ్ళు బారిన పుడమిలో
లేత మొలక ఉదయించింది
రెక్కలు విచ్చుకుంటూ నింగి వైపు చూస్తోంది
అవనిని దాటి గగనసీమవైపు అడుగులు వేసింది
మోడు వారిన మానులో
మారాకు మొగ్గ తొడిగింది
చిగురించిన ఆశతో
గమ్యాన్ని అన్వేషిస్తోంది
కారు చీకటి బాటలో చంద్రోదయం ఉదయించింది
నిశి తెరలను చీల్చుకుంటూ
వెలుగుతీరాలకు ఎగసింది
ఆగిన జీవన చక్రం
ప్రగతి దిశన కదులుతోంది
దోబూచులాడిన గమ్యం
మరో ప్రస్థానానికి తెరలేపింది
ఆగనివ్వను పయనమంటూ
నెచ్చెలి మనసు జతగూడింది
రగిలిన మనసుల పంతం
మరో చరితకు శ్రీకారం చుట్టింది
మనసుల గమనంలో
తొలకరి జల్లు పరిమళించింది
ఓడిన మెట్టుపైనే
గెలుపు మార్గం మొదలయ్యింది
కూలిన శిఖరానికి
మనసు పునాది లేచింది
ఇక ఆగదు పయనం
చేరకతప్పుదు గమ్యం
మనసూ మనసుల మేళవింపు
నవశకానికి మేలుకొలుపు
మనస్వినీ