Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Saturday 6 June 2015

అమ్మకానికి మనసులు

అమ్మకానికి మనసులు

నాసికను అలరిస్తూ మత్తుగా
రమ్మని పిలుస్తున్న సుగంధ పరిమళాలు
కళ్ళు జిగేల్ మనిపించే విద్యుల్లతలు
మనసును దోచే అలంకరణలు
కనులు తిప్పుకోలేని సోయగాలు
అది సంత కాని సంత
అందమైన వింత
దూరంగా రాసి ఉన్న అక్షరాలు
చూపు తిప్పుకోలేకపోయాను
ఇక్కడ మనసు ఇవ్వబడును
అంటూ ఆహ్వానం
మనసు విపణిలోకి అడుగు పెట్టాను
ఒకటికాదు లక్షల మనసులు
అందమైన మనసులు
రకరకాల మనసులు
పొగరున్న మనసులు
వగరున్న మనసులు
మనసైన మనసు లేక
విలవిలలాడుతున్న నా మనసు
ఓ అందమైన మనసుకోసం వెతకసాగింది
ఓ మనసును చూసాను
మెల్లగా పలకరించాను
నన్ను బాగా చూసుకుంటావా
అన్ని కోరికలూ తీరుస్తావా
ఆటలు పాటలూ షికార్లు
అన్నీ చూపిస్తావా
ఆ మనసు ప్రశ్నల పరంపరలోనే
రేట్ ట్యాగ్ చూసాను
ధర కొంచెం ఎక్కువే
ముందుకు కదిలాను
మరో మనసును కదిలించాను
నేను నచ్చానా
నాతోనే ఉంటావా
అవే ప్రశ్నలు అవే ధరలు
ఇంకో అడుగు ముందుకు వేసాను
ఎంతో అందంగా ఉంది ఆ మనసు
ఏం ఆ మనసు అంత బాగా నచ్చిందా
అక్కడే ఇంత సేపున్నావ్
ఎన్ని మనసులను చూసావు
ఎన్ని మనసులను కొన్నావు
నా అవసరం ఏముంది
శరపరంపర ప్రశ్నలను తాళలేక పోయాను
అమ్మో ఇది మనసా మానసిక జాడ్యమా
అనుకుంటూ అక్కడినుంచి కదిలాను
మరో మనసుకు ప్రణమిల్లాను
బాగా నచ్చింది
మాట కలిపాను
నాతో మాట్లాడుతూనే మరో మనసుకు కన్ను గీటింది
అలా చేస్తున్నావేమీ అని అడిగా
నువ్వేమన్నా ఆరుస్తున్నావా తీరుస్తున్నావా
నాకు నేనే పెట్టుబడి
ఎలాగైనా ఉంటా
ఎవరితోనైనా పోతా అని ఎదురుతిరిగింది
అదీ నిజమేనని మరో అడుగు వేసా
మరో మనసు
ఆ మనసులో ఎదో దుర్వాసన
కుట్రలు కుతంత్రాల వాసన
తను మనసే అయినా మరో మనసును
ముంచాలన్న తపన
అన్ని స్టాల్స్ తిరిగాను
ఒక్కో మనసు ఒక్కోలా ఆలోచిస్తోంది
స్నేహం ముసుగులో
ముంచటం ఎలా అని ట్రెయినింగ్ తీసుకుంటున్న మనసు
మనీ కోసం అద్దెకు వెళ్లేందుకు సిద్ధమయిన మనసు
అన్న మనసు
తమ్ముడి మనసు
భార్య మనసు
చెలియమనసు
చెల్లి మనసు
స్నేహమనే ముసుగు మనసు
మనసు మార్కెట్ లో ఏమనసు చూసినా
ఏమున్నది గర్వకారణం
అన్ని మనసులూ అనుమానం పుష్పాలే
బిత్తరపోయిన నా మనసు తొందర పెట్టింది
బయటికి నడువ్ అని గద్దించింది
నాకు మరో నేస్తం వద్దే వద్దని మారాం చేసింది
నిజమేననిపించింది
మనసైన మనసు దొరకదని
పిచ్చి మనసులు
అనుమానం మనసులు
వికృత మనసులు
అబ్బో ఈ మనసులు నాకు వద్దు
మరమనుషులే ముద్దు అనుకుంటూ
మనసు సంత నుంచి
బయటపడ్డా

4 comments:

  1. మీ బ్లాగ్ & భావాలు రెండూ చాలా బాగున్నాయండి.

    ReplyDelete
    Replies
    1. థాంక్స్ మార్కండేయ గారూ...

      Delete
  2. టైటిల్ తో పడేసారు
    కవిత సూపర్బ్...

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదములు పద్మార్పితాజీ..

      Delete