Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Friday 28 August 2015

మౌన భాష...

మౌన భాష...

చెప్పుకుందామని అనుకుంటే
మాటలే మూగబోయాయి
రాసుకుందామని అనుకుంటే
అక్షరాలూ మాయమయ్యాయి
చూసుకుందామని అనుకుంటే
కన్నుల సుడులలో
భావాలే కరిగిపోయాయి
అచేతనమైన ప్రకృతి ఒడిలో
సవ్వడే చేయని పిల్లగాలిలో
బిగుసుకుపోయిన మారాకుల్లో
రాగాలు మరిచి రాలిపడిన పువ్వుల్లో
మెల్లగా జారిపోతూ
కొండలవెనుక ఒదుగుతున్న సూరీడులో
కమ్ముముంటున్న చీకటిలో
పెదాలు విప్పని మనసుల్లో
వినిపించేది
కనిపించేది మౌనమే
అయినా మనసులు మంతనమాడుతున్నాయి
పిల్లగాలి సవ్వడి వింటున్నాయి
రాలిపడిన పువ్వుల పాటలూ వింటున్నాయి.
ఒదుగుతున్న సూరీడు భావాలనీ
కమ్ముకుంటున్న చీకటి ఆరాటాన్నీ
ఆస్వాదిస్తున్నాయి
అవును
రెండు మనసులూ మాటలాడుకున్నాయి
అక్షరాలు లేని భావాలనీ
మాటలే లేని ఊసుల్నీ
చెప్పుకున్నాయి
చేతిలో చేయి వేసుకుని
కళ్ళలో మమతల రంగులు పులుముకుని
చిరు స్పర్శలోనే
మనసు అంతరంగాన్ని
పంచుకున్నాయి
అవును
అది అక్షరాల భాష కాదు
మాటల గోస కాదు
అది మనసు భాష
మౌనంగానే ఉంటుంది
మనస్వినీ

1 comment: