సజలనేత్రం
చెట్టుకొమ్మన గాలికి
ఊగిసలాడుతున్న
మామిడిపిందెను
చూస్తున్నా
ఆకుల మాటున
కువకువలాడుతున్న
పక్షుల జంటను
చూస్తున్నా
అప్పుడే వచ్చి ఇష్టమైన
ఫలాన్ని అందుకునేందుకు
కోయిలమ్మ ఆరాటాన్నీ
చూస్తున్నా
నేలరాలిన షహదూద్
పళ్ళను ఏరుకునే
చిట్టి పిచ్చుకలనూ
చూస్తున్నా
మనసును మచ్చిక
చేసుకునే ఆ దృశ్యం
క్రమంగా మసక బారింది
స్పష్టమైన దృశ్యం
అస్పష్టంగా మారింది
సజలనేత్రాల మబ్బులను
దాటలేని కంటిచూపు
విశ్రాంతిని కోరింది
అప్రయత్నంగానే
మూసుకున్న రెప్పలనుంచి
జారిపడిన ఒక కన్నీటి
చుక్క అడిగింది ఏమయ్యింది నీకని
నిలదీసిన ఆ చుక్కకు
ఏమని సమాధానం చెప్పను
నాకేమయ్యిందని
చెప్పుకోను
మనసు ఎందుకు
విలపిస్తోందో
ఏ బాధ ఎందుకు
మెలియపెడుతోందో
ఎలా చెప్పను
మనసు బాధ తెలుసుకుందో
సమాధానం రాదనుకుందో
ఎందుకోగాని కన్నీరు
చెంపను ముద్దాడుతూ
జారిపోయింది
మరలా అదే దృశ్యం
కనిపిస్తోంది మళ్ళీ
స్పష్టంగా
No comments:
Post a Comment