నేర్వలేని పాఠం
నీలాల నింగిలో
హాయిగా పయనించే
విహంగానికి
రెక్కలు ఇచ్చావు
ఎగరటం నేర్పావు
ప్రమాదాన్ని తప్పించే
తుంటరితనం నేర్పావు
నీటిలో విహరించే మీనానికి
ఈత నేర్పావు
శ్వాసకోసం మొప్పలు
ఇచ్చావు
తిమింగలానికి చిక్కని
నేర్పునూ ఇచ్చావు
అందరికీ అన్నీ ఇచ్చావు
శత్రువులను ఇచ్చావు
మిత్రులనూ ఇచ్చావు
నాకూ జీవితం ఇచ్చావు
కుట్రలు చేసే మనుషులను
ఇచ్చావు
ఆవేశంలో రగిలే మనసులనూ
ఇచ్చావు
ఎక్కడో కూర్చుని
జీవితాన్ని శాసించే
దగుల్బాజీలనూ ఇచ్చావు
దేవుడా మరి నాకు
జీవించటం ఎందుకు
నేర్పలేకపోయావు
జీవితం నేర్పని దేవుడు
ఈ జీవితాన్ని
తిరిగి తీసుకుంటే
ఎంత బావుండేది
ఈ జీవితం నాకు
నేర్వలేని పాఠమే
మనస్వినీ
No comments:
Post a Comment