నిన్న రాతిరి కలలో
అప్పుడప్పుడే కనులు
మూత పడ్డాయి
సమస్యల వలయంలో
విలవిలలాడిన మనసు
అప్పుడే సేదతీరుతోంది
మెల్లగా మగత
కమ్ముకుంటోంది
పాదాల దగ్గర ఏదో
అలికిడి
ఏదో చిరు సవ్వడి
ఏదో మత్తయిన పరిమళం
ఎవరో సుతిమెత్తగా
తట్టి లేపుతున్న భావన
అప్రయత్నంగానే కనులు
తెరుచుకున్నాయ్
ఎదురుగా ఓ కాంతి పుంజం
కనులు చిట్లించి
చూస్తే
ఆ మెరుపుల బంతి
క్రమంగా ఒక ఆకారంలా
కనిపించింది.
ఒక అందమైన మగువ
దివ్యమైన యువతి
సంభ్రమాశ్చర్యాలతో
తేరిపార చూశాను
అవును తనే
నా అనుమానం నిజమే
తనే వచ్చింది
అప్పుడప్పుడూ
సాయం సంధ్యలో
నిశి తెరలలో
లీలగా కనిపించీ
కనిపించీ కనిపించని
మెరుపులతో
తళుకులు కురిపించే తను
నా పాదాల చెంత
ఆసీనురాలైంది
ఎప్పుడూ మేలిముసుగులో
కనులను దాచి
అర్ధ చంద్రునిలా
కనిపించే తను
ఎందుకో ఏమో
మోముపై పరదా ఎక్కడో
విసిరేసింది
తననే చూస్తున్నా నేను
నావైపే చూస్తున్న తను
మనసారా నవ్వుతోంది
నవ్వులపువ్వులతో
విరిసిన వదనం
చందమామను తలపిస్తోంది
నా పాదాలను మెత్తగా
స్పృశిస్తూ
ఏదేదో చెబుతోంది
తీయని తేనీయల ఉర్దూ
పదాలు
ఆమె స్వరంలో
పునీతమవుతున్నాయి
కబ్ తక్ ఇస్ దునియాసే
లడోగే
ఎక్ బార్ ఆజావో ఖుషీ
కే చమన్ మే
సమస్యల జగత్తును వీడి
స్వాప్నిక లోకంలోకి రమ్మని
స్వాగతం పలుకుతోంది
నోట మాటే లేని నేను
తనవంకే చూస్తున్నా
నవ్వుల పువ్వులు
రువ్వుతూ
షాహేరీ రసాలను
చిలికిస్తూ
నాకు మరింత చేరువ
అయ్యేందుకు
ఒళ్ళు సవరించుకుంది
అప్పుడే
నా గుండియను తడిమింది
ఓ నులివెచ్చని స్పర్శ
ఆప్పుడు నిజంగా కళ్ళు
తెరిచాను
ఆశ్చర్యం
తను లేదు
తను లేదు
ఆ వెలుగుల జిలుగులూ
లేవు
నా గదిలో చీకటి తప్ప
అవును
నా గుండెను మెత్తగా
తడిమి
కలను తరిమేసింది
ఎవరో కాదు
అది
మనస్విని
No comments:
Post a Comment