బతుకు గీతలు
నువ్వే అనుకున్నా
అంతా నువ్వే అనుకున్నా
అన్నీ నీ రాతలే అనుకున్నా
సమస్యల వలయం జీవితానికి
నీ రాతలు నీ గీతలే కారణమని అనుకున్నా
ఎక్కడో కూర్చుని
పెగ్గు మీద పెగ్గు కొట్టి
ఒళ్ళు తెలియని స్థితిలో
పిచ్చి గీతలు గీస్తున్నావని అనుకున్నా
కథ స్క్రీన్ ప్లే
నీదే అనుకున్నా
జీవితం పాఠం నేర్పింది
అనుభవం కళ్ళు తెరిపించింది
నీ రాతలు
నీ గీతలు
తారుమారాయ్యాయని తెలుసుకున్నా
తెలివి మీరిన మనిషి
స్వంత రాతలు రాస్తున్నాడు
మనసుకు తోచిన గీతలు గీస్తున్నాడు
ఒకరు చిన్న గీత గీస్తే
మరొకరు పెద్ద గీత గీస్తున్నారు
అడ్డ గీత ఒకరిది
అష్టా వక్ర రేఖ మరొకరిది
ఒకరు ఒక గీత గీస్తే
మరొకరు దానికి అడ్డంగా గీస్తారు
ఇంకొకరు ఆ గీతలను చెరిపేస్తూ
వలయాలు సృష్టిస్తారు
ఎక్కడో నువ్వు కూర్చుని డిసైడ్ చేసే రోజులు పోయాయి
ఇక్కడ జీవితాలను మనిషే డిసైడ్ చేస్తున్నాడు
బలవంతుడి పెద్ద గీతలకు
విషనాగుల వలయాలకు
సామాన్యులు బలైపోతున్నారు
భావుకతలో విహరించే నేను
అక్షరాలు రాసుకున్నా
ఊహల లోకంలో మునిగిపోయా
నా బతుకు గీతలు మాత్రం గీసుకోలేకపోయా
భాగ్య రేఖలు రాసుకోలేక పోయా
మనస్వినీ
No comments:
Post a Comment