వస్తా నీకోసం
వస్తా నీకోసం
నిజంగా ఉన్నావో లేవో
చూడాలని
ఆరు నూరైనా నూరు ఆరైనా
వస్తా నీకోసం
నిజంగా నువ్వుంటే
లెక్కలు తేల్చుకుందామని
భువిలో ఓటమికి
దివిలో కారణాలు
వెతుకుదామని
ఉన్నావా నువ్వసలు
ఉంటే దేవుడివేనా
నువ్వు
ఎలా ఒప్పుకోవాలి
నువ్వే దేవుడని
నిజంగా నువ్వే
దేవుడివే అయితే
ఎక్కడున్నావు
మబ్బుల చాటున దాగి
ఉన్నావా
కొండల మాటున నక్కి
ఉన్నావా
మనుషుల ప్రశ్నలకు
జవాబు చెప్పలేక
బ్లాక్ హోల్ లో కలిసిపోయావా
దైవమె నీవైతే
మా రాతలే నీవు రాస్తే
నా రాత ఎందుకిలా
రాసావు
మందుకొట్టి రాసావా
నిద్ర మత్తులో గీతలు గీసావా
ఏం పాపం చేశానని
ఎవరికి ద్రోహం చేశానని
మనసు మాటే వినటం పాపమా
జీవితాన్ని వ్యాపారం
చేయకపోవటం నేరమా
బంధాలు అనుబంధాల కోసం
ప్రాకులాడటం ఘోరమా
అయినవాళ్ళు అన్నీ
మరిచి బేహారులై నిలిస్తే అది న్యాయమా
మనీ మనుషులు ఏది
చేసినా అదే వేదమా
మనీ ముందు మనసు
చెత్తకాగితమైతే అది ధర్మమా
ఎవడికి కావాలి నీ
ధర్మం
ఎవరికోసం నీ న్యాయం
అవునులే
కానుకల రూపంలో లంచం
ఆశించే నీవు
దేవుడివి ఎలా అవుతావు
పచ్చి వ్యాపారివేగా
జీవితాలను వ్యాపారంగా
మలిచిన నీవు
ఇంతకంటే ఏం న్యాయం
చెయ్యగలవు
అయినా
వస్తా నీకోసం
నిజంగా నీవుంటే
నిలదీస్తా నిన్ను
నువ్వు లేవని తెలిసినా
వస్తా నీకోసం
No comments:
Post a Comment