అక్షయపాత్ర
మానసం
ఆచార్యుడను కాను నేను
బోధనలు చేయలేను
పండితుడిని కాదు నేను
పాండిత్యము లేదు నాకు
డాక్టరేట్ లేదు నాకు
పరిశోధనలు చేయలేదు నేను
భాషాప్రావీణ్యుడను కాదు నేను
గ్రంథాలేవీ రాయడం రాదు నాకు
అయినా రాస్తూ ఉంటాను నేను
అరకొర అక్షరాలనే నమ్ముకుంటాను నేను
మనసులో పుట్టిన ఆలోచన
మనసు పడిన వేదన
మనసు పులకించిన ఘడియ
అనుభవాలు
అనుభూతులు
ఇవే నా అక్షరమాలికలు
కొన్ని అక్షరాలు నవ్వుల పువ్వులై
విరబూస్తే
కొన్ని అక్షరాలు వెన్నెల వానై
కురిసిపోతుంటాయి
మరికొన్ని అక్షరాలు కన్నీటి తడిలో
కరిగిపోతుంటాయి
హిపోక్రాటును కాదు నేను
అనుకున్నదే రాసుకుంటాను
భావాల జడిలో అక్షరాలు చెదిరిపోతే
పులకించిన అక్షరాలు
నిద్రాణమనసును తట్టిలేపితే
మొనతేలిన అక్షరాలు
ముల్లులా గుచ్చుకుంటే
రాయకుండా ఆపలేను నేను
ఎందుకంటే
అక్షయ పాత్ర నా మానసం
ఒక భావం కరిగిపోతే
మరో భావం ఉదయిస్తూనే ఉంటుంది
మనస్వినీ
No comments:
Post a Comment