కనిపించని సంకెలలు
నీలాల నింగి తారకలను దోసిటపట్టి
నక్షత్రాలతో ఊసులు
చెప్పుకుందామని అనుకుంటే
చుక్కలన్నీ నల్లరంగు పులుముకున్నాయేమో
మిలమిలలే కానరాలేదు...
చందమామ చెక్కిలిపై చిటికెలు వేసి
కాసింత వెన్నెల దోచుకుందామని అనుకున్నా
ఇక పున్నమి లేనే లేదేమో
నెలరాజు అమావాస్య దుప్పటి కప్పుకున్నాడు...
ఉషోదయపు వెలుగుల్లో
నులివెచ్చని స్నానం చేయాలని అనుకున్నా
సూరీడుకి సంధ్యాకాంత కౌగిలే ఇష్టమేమో
పడమటి కిరణాలు వెక్కిరిస్తూ కనిపించాయి...
ముసురుపట్టిన ఆలోచనలనుంచి
పారిపోవాలని అనుకున్నా
కనిపించని సంకెలలు ఏవో
అడుగులను కట్టిపడేస్తున్నాయి
మనస్వినీ...
No comments:
Post a Comment