కొత్తా దేవుడండీ
చిన్నప్పుడు అమ్మ చెబుతూ ఉండేది
దేవుడు చాలా మంచివాడని...
ఇప్పుడూ చెబుతూనే ఉంది
దేవుడు మంచి వాళ్ళకి మంచే చేస్తాడని...
చెడ్డవాళ్ళకి షైతాను దోస్తు అయితే
మంచివాళ్ళకి తోడుగా దేవుడే వస్తాడని...
మసీదుల్లో ఇమాముల వాదనా ఇదే
దేవుడిని నమ్ముకుంటే మంచే జరుగుతుందని...
ఊరిలో ఉన్న దేవళం నుంచి మైకుల్లో గీత వినిపించేది
ధర్మ సంస్థాప నార్ధాయా సంభవామి యుగేయుగే అని...
చర్చిలోకి తొంగి చూసినప్పుడూ తెల్ల డ్రెస్సు పెద్దాయన పలుకులివే
దైవమును నమ్ముడి ఆయనే మీకు రక్షయనీ...
చిన్నవయస్సు నుండే ఇవన్నీ మెదడులో
ముద్రవేసాయి
సర్వాంతర్యామి దేవుడే అని...
అన్ని మతాలు ఏకమై దేవుడిని ఆకాశానికి ఎత్తేస్తే
దేవుడిని మించిన శక్తి మరేదీ లేదని నమ్మాను...
ఎందుకో ఇప్పుడు అలా అనిపించటం లేదు
దేవుడు మరీ అంత పవర్ ఫుల్ కాదనీ...
లోకం తీరు చూస్తే ఈ మనుషుల మతలబులు చూస్తే
దేవుడు ఎప్పుడో భూమి మీదకు రావాల్సింది...
ధర్మం ఎప్పుడు గెలుస్తుంది
అధర్మం ఎప్పుడు ఓడుతుంది
మనుషులు చచ్చాకనా...
మరో విషయం మంచోళ్ళకు
మరణం తర్వాత స్వర్గం ప్రాప్తిస్తుందని
అవేవో పుస్తకాలు చెబుతున్నాయి...
జీవితమంతా నరకం అనుభవించి
చచ్చాక మాత్రం ఉన్నదో లేదో తెలియని స్వర్గం ఎందుకు...
అసలు ధర్మ సందేహం ఏమనగా
వేలకోట్ల సంవత్సరాల పాలనలో
అందరు దేవుళ్ళూ అలసిపోయారేమో...
విశ్రాంతి కోసం కొత్త దేవుడికి చార్జి ఇచ్చేసారేమో
ఎవరికీ తెలియని కొత్త దేవుడి పాలన
ఎప్పుడో మొదలయ్యిందేమో...
బాబోయ్
కొత్త దేవుడు గారు ఎలా ఉంటారు
ఆయన న్యాయం ఇలాగే ఉంటుందా
కొంపదీసి షైతానే ప్రజలను పాలిస్తున్నాడా
కలవరం పుట్టిస్తున్న ఈ ఆలోచనలు
కొత్త ఆలోచనలు పుట్టిస్తున్నాయి
కొత్త దేవుడికి మొక్కి తీరాలేమో...
No comments:
Post a Comment