మరణమంటే
భయమెందుకు...
రెప్పపాటులో
కరిగిపోయేది
ఒకసారి జారితే మరలా
తిరిగిరానిది
ఎంత అమూల్యమో
అంతే విలువలేనిదీ
జీవితం...
అక్కరకు రాని ఆరాటం
ఎందుకు
పనికిమాలిన పోరాటం
ఎందుకు...
నిజమెందుకు వద్యశిలపై
తలవాల్చింది
నమ్మకం ఎందుకు
ఉరికొయ్యకు వేలాడుతోంది
అనుమానాలు అవమానాలు
పిశాచ గణాలై ఎందుకు
ఉసురు తీస్తున్నాయి...
ఆవేశమెందుకు
వెర్రితలలు వేస్తోంది
అనురాగమెందుకు మంచులా
కరుగుతున్నది
జీవితమెందుకు నరకంలా
మారుతున్నది...
అనుభూతులు ఎందుకు
అనుభవాలుగానే
మిగిలిపోతున్నాయి
అనుభవాలు ఎందుకు మంటలు
రేపుతున్నాయి
అనుభూతిని పంచని
అనుభవమెందుకు...
తలరాతలు రాసే అధికారం
మనుషులకు ఎందుకు
మనిషే మనిషిని
శాసిస్తే దేవుడు ఎందుకు
నాస్తిగా దేవుడే
మారితే ఆస్తికులు ఎందుకు...
మనసు పంచి ఇవ్వని
మనుషులకు మమతలు ఎందుకు
మమతే మాయమైతే సిరి
సంపదలు ఎందుకు
కనులు మూస్తే రాలిపోయే
జీవితానికి
కోట్ల ఆస్తులు
ఎందుకు...
వ్యక్తిత్వాన్ని పరులే
నిర్దేశిస్తారు ఎందుకు
పరపలుకులే తూటాలుగా
మారడం ఎందుకు
మనసే మనసును నిందిస్తే
ఈ జీవితం ఎందుకు...
అబద్దమనే సాలెగూడులో
నిజానికి మరణం తప్పదని
తెలిసినా
ఇంకా పనికిరాని
మౌనమెందుకు
అందుకే జీవితంపై
తిరుగుబాటు చేస్తున్నా
నాకింకా మరణమంటే
భయమెందుకు
మనస్వినీ...
No comments:
Post a Comment