మౌనంగానే శబ్ధం చేసిన
శూన్యం
ఎంత మధురం ఈ మౌనం
ఎంత ఉపశమనం ఈ మౌనం
ఎంత అద్భుతం ఈ నిశబ్ధం
ఎంత ఓదార్పు ఈ నిశబ్ధం
ఎంత అందమైన అనుభవం ఈ శూన్యం
ఎంత తీయని లేపనం ఈ శూన్యం
మౌనంలోనే నేను మధురానుభూతిని
పొందుతాను
మౌనంలోనే నేను ఆనందాన్ని
వెతుక్కుంటాను
ఈటెలను తలపించే మాటలుండవు
గుండెను తాకే తూటాలు ఉండవు
మౌనంలో నేను నాతోనే మాటాడుతూ ఉంటాను
నన్ను నేను ఓదార్చుకుంటాను
నిశబ్ధం అంటే నాకు చాలా ఇష్టం
నిశబ్ధంలోనే చిన్ని చిన్ని సవ్వడులతో
నా మనసు శబ్ధం పుట్టిస్తుంది
మనసుకు ఇంపైన ఒక శబ్ధం
మనసును మురిపించే మరో శబ్ధం
మనసుకు నచ్చేదే ప్రతి శబ్ధం
నిశబ్ధంలో నాకు నచ్చని శబ్ధమే లేదు
ఎక్కడో శూన్యంలో చూస్తూ కూర్చోను
ఆ శూన్యంలోనే రంగులు వేస్తూ ఉంటాను
జీవన గమనంలో ప్రతి దృశ్యాన్నీ
శూన్యంలోనే నెమరు వేసుకుంటాను
మౌనాన్ని అక్కున చేర్చుకుని
నిశబ్ధానికి గుండెను పరిచి
శూన్యంలో విహరించటం నాకెంతో ఇష్టం
మనస్వినీ
No comments:
Post a Comment