ఎవరికెలా అనిపిస్తే అలా...
ఒక మనసు ఒకలా
మరో మనసు మరొకలా
ఎవరికి తోచిన భాష్యం వారిది...
నా అక్షరాలు అందరికీ ఒకేలా అనిపించవు
ఒక్కో మనసును ఒక్కోలా
పలకరిస్తున్నాయి నా భావాలు...
ఒకరికి ఆనందం కలిగిస్తే
ఒకరికి విషాదం చూపుతున్నాయి
ఒకరికి ఆగ్రహం కలిగిస్తే
మరొకరికి నవ్వు తెప్పిస్తున్నాయి...
చాలా సూటిగా రాస్తున్నావని ఒకరు
హృద్యమైన భావమని మరొకరు
తిరుగుబాటుకు సంకేతమని ఇంకొకరు
ఎవరికి ఎలా అర్థమైతే అలా...
జీవితాన్ని ఆహ్లాదంగా
అనుభవిస్తున్నావని ఒకరంటారు
ఎప్పుడూ ఏదో కోల్పోయినట్లు
రాస్తారేమని
మరొకరంటారు
భలే చెప్పావన్నా అని ఒక ప్రోత్సాహం...
నా అక్షరంలో నాకు ఇవేమీ కనిపించవు
అభిప్రాయాలను నేను రాయను
ప్రభావిత పూలను పూయించను
మతలబు సుగంధాలు అక్షరాలకు పూయను
లక్ష్యాలను నిర్మించి అక్షర వంతెనలను
కట్టను
ప్రేమను రంగరించను
ఆవేశాలను విరజిమ్మను
ఆవేదనలు నటియించను...
గుండె చప్పుళ్ళకు నిజాయితీని జోడించి
అక్షర కుసుమాలను సాగు చేస్తూనే ఉంటా
ఎవరికి నచ్చినా నచ్చకున్నా
మనస్వినీ...
No comments:
Post a Comment