మహా
మాయగాడిని
నేను మనిషిని
సృష్టికర్త సృష్టికే అందని బ్రహ్మ పదార్థాన్ని
శాస్త్రవేత్తల అంచనాలకు అందని
కృష్ణబిలాన్ని
ఏ వెలుగూ ఛేదించని
గాడాంధకారాన్ని...
అవును నేను మనిషిని
ఎవరికీ అర్థంకాని అయోమయాన్ని
ఒకే దేహంలో కానరాని ఎన్నో రూపాలకు నిలయాన్ని
ఒకే మనసులో జనియిచే వైవిధ్యాలకు ఆలవాలాన్ని
నేను మనిషిని
మనిషికే అర్థంకాని అంతరంగాన్ని...
జీవన కూడలిలో నిలిచి
నాలోని పార్శ్వాలను చూసి
బెదిరిపోతున్న మానసిక వికారిని
ఓ ఘడియ ఒక రూపం
మలి ఘడియ మరో రూపం
రోజు గడిస్తే భిన్న కోణం
మనిషిని
విభిన్న ఆలోచనల సంగమాన్ని...
నాలోని ఒకరూపాన్ని పలకరించాలని చూస్తే
అనుకున్న లక్ష్యసాధనకై శ్రమిస్తున్న
శ్రామికుడు కనిపించాడు
అంతలోనే కనుమరుగయ్యాడు
మరో రూపంలో తల ఎగురవేస్తున్న వైభవం
ఆదర్శమూర్తి దర్శనం…
నాలోనుంచి జారిపడి పారిపోతున్న
మరో ఆకారాన్ని చూసాను
అదీ నేనే
పిరికివాడిని
చేతకాని దద్దమ్మని...
అంతలోనే మరో రూపం
నేలమీద పాకుతున్న సూక్ష్మ క్రిమిలా
అదీ నేనే
అమీబా బ్యాక్టీరియాలా
మరో మాటలో పరాన్న జీవిలా...
ఈ రూపాన్ని మరిచేలోగానే
మరో రూపం పలకరించింది
కళ్ళనిండా అసూయ అనే సుర్మా పూసుకుని
పచ్చగా ఉన్నవాళ్ళనే కాదు
సమస్యలను సైతం అసూయగా చూసే
మానసిక జాడ్యమది
అవును నేను మనిషిని
నాలో నాకే తెలియని రహస్య సమరాలకు
బలి అవుతున్న
ఆయుధం పట్టని పిరికి సేనానిని...
జీవనకూడలిలో
మరణమనే రూపాన్ని ఆవిష్కరించేందుకు
ఉత్సుకతతో ఎదురు చూస్తున్న
శాస్త్రవేత్తని…
అవును నేను మనిషిని
సృష్టికర్త మాయలకే అందని
మహా మాయగాడిని...
No comments:
Post a Comment