ఒక తంతు
ముగిసింది
నిశి
వీధుల విషవలయంలో
ఒంటరినై
నడిచినప్పుడు
ఎవరూ
తోడురాలేదు...
చీకట్లు
కన్నులను పొడిచేస్తుంటే
అయినవారెవరూ
గుడ్డి దీపం సాయమూ చేయలేదు...
కరకు
తేలిన కంకర రాళ్ళు
మొనలుదేలిన
ముళ్ళూ
పాదాలకు
గాయం చేస్తే
కారుతున్న
రుధిరం నా చరిత్రను రాస్తూ ఉంటే
చిరునవ్వులు
చిందించినవారే తప్ప
లేపనం
అద్ది ఓదార్చిన వారు లేరు...
సంకెలలే
లేని బంధీనై
ఎవరికీ
కానివాడనై
ఒంటరిగా
నేనుంటే
కన్నెత్తి
చూసిన వారే కానరాలేదు...
ఇంతలోనే
ఎంత మార్పు
ఇప్పుడు
అందరి వాడినయ్యాను
అందరూ
వస్తున్నారు
ప్రతి
ఒక్కరూ పలకరిస్తున్నారు
చులకన
చేసిన చూపులే భక్తితో ప్రణమిల్లుతున్నాయి...
ఎందుకో
ఏమో నా వెంట నిత్యం నిలిచిన మనసులు
ముభావంగానే
ఉన్నాయి
ఈ లోకం
తీరు నచ్చకనేమో...
నా
వాళ్ళూ నన్ను అభిమానించే వాళ్ళూ
అందరినీ
చూసి మనసులో ఏదో తృప్తి
నేను
ఒంటరిని కానని...
ఇప్పుడు
నాతో కలిసి అందరూ నడుస్తున్నారు
నా
మార్గంలోనే అందరూ ఉన్నారు
నాకే
జయజయ ధ్వానాలు పలుకుతున్నారు
మహారాజునై
పొంగిపోతున్నాను...
గమ్యం
చేరితేగానీ తెలియలేదు
నాది
ఆనందం కాదనీ
అది
నీటి బుడగేననీ...
నిశి
వీధుల వలయం నుంచి నన్ను తస్కరించి
సమాధియనే
గుహలో బంధించి
అందరూ
తిరిగి వెళ్ళిపోతున్నారు
ఒక తంతు
ముగిసినట్లుగా...
No comments:
Post a Comment