అదే నేనూ అదే చోటూ
అదే చోటు
నువ్వూ నేను కలిసి
గడిపిన చోటు
ఒకరికి ఒకరం కబుర్లు
చెప్పుకున్న చోటు
భావోద్వేగాలు
పంచుకున్న చోటు
అదే మనకు ఎంతో ఇష్టమైన చోటు
అక్కడికే వెళ్లాను
అక్కడే ఉన్నాను
రెండు ఘడియలు గడిపాను
కోల్పోయిన చోటే
వెతుక్కోవాలని
ఆరాటపడ్డాను
నీ తీయని పెదాల నుంచి
జారిపడిన
ఊసుల ఆనవాళ్ళు
కనిపిస్తాయేమోనని
చిరుగాలి సవ్వడిలో
వెతుకుకున్నాను
ఆ మాటలు
ఆ ఊసులూ
ఇక్కడి చెట్ల కొమ్మలకు
కొమ్మల రెమ్మలకూ
రెమ్మల్లోని
చిగురుటాకులకూ
అంటుకుని ఇంకా
ఉన్నాయేమోనని
పిచ్చిగా
తడిమి చూసుకున్నాను
ఇనుపకంచెలను దాటిన
చూపులకు
వైభవం కోల్పోయిన సాగరం
ఆనవాళ్ళు
కనిపించాయి
ఎక్కడో కంటి చూపుకు
ఆనీ ఆననట్టు
చిన్న నీటి చెలమలా
కనిపించింది సాగరం
కుచించుకుపోయిన
మనసులా
కరిగిపోయిన గతం తాలూకు
ఆనవాళ్ళు
అక్కడి పిల్లగాలిలో
కొట్టుకుపోయాయి
చేసేది ఏమీ లేక
వెనుదిరిగాను
నిర్వికారమైన
మనస్సుతో
చేసేది ఏమీ లేనప్పుడు
చెప్పేది ఏమీ
లేనప్పుడు
మౌనంగానే
ఉండాలనే
నిజం మాత్రం
తెలుసుకున్నా
మనస్వినీ
No comments:
Post a Comment