మనసు సిత్రాలు
అంతా మాయగా ఉంది
ఎవరో మంత్రమేసినట్టు
ఉంది...
నా అదుపులో ఏమీ
లేకుండా
నా ఆలోచనలతో
ప్రమేయమే లేకుండా
నా భావాలతో నిమిత్తం
లేకుండా
అంతా జరిగిపోతున్నట్లుగా
ఉంది...
నా మనో ఫలకంపై
కదలాడుతున్న చిత్రాలను
చూస్తుంటే...
ప్రతి ఘడియా
ప్రతి అనుభవమూ
నా విజయమూ
నా పరాజయమూ
ఒక్కో చిత్రంగా
ఎవరో చిత్రించిన
బొమ్మలుగా
అన్ని అనుభూతులూ
నా మనసు తెరపై
కదలాడుతూనే ఉన్నాయి...
అనుభవాల చలన
చిత్రాలుగా
ఒక అనుభవం మనసు తెరపై
మంటలు రేపుతూ ఉంటే
మరో అనుభూతి
చల్లని పన్నీరు
చిలికిస్తోంది...
తీపి చేదు అనుభవాల
అనుభూతులను
జల్లెడపట్టి
పన్నీటితో మనసును
శుద్ధి చేస్తూ ఉంటే
మరో అనుభవం
గుండెకు తూట్లు చేసేందుకు
శరములా దూసుకు
వస్తోంది...
గుండెను అప్పగించటం
తప్ప
ఏమీ చేయలేకపోతున్నా...
మరలా మనసు గాయానికి
లేపనం పూసేందుకు
అన్ని శక్తులు
కూడదీసుకుంటున్నా...
అన్ని అనుభవాల
అనుభూతులకు వేదికైన
నా మనస్సు
మరిన్ని
ఘడియల చిత్రాలను
హత్తుకునేందుకు
వినమ్రముద్రలో
వేచియుంది
మనస్వినీ...
No comments:
Post a Comment