ఎవరు చూసారు ఆ లోతుల్ని...?
ఎవరు చూసారు నీ
అంతరంగాన్ని
ఎవరు తట్టి చూసారు
నీలోని లోతుల్ని
నిండు కుండలా
నిర్మలంగా ఉన్న నీలో
చెలరేగే సుడులను ఎవరు
గమనించారు
ఎగసి పడే నీ అలల్ని
మింగేసే కెరటాలుగానే
చూసారు
అవి నీ ఎదలోతుల
చెలరేగిన
అలజడుల తరంగాలని
ఎవరు తెలుసుకున్నారు
సాగర గర్భాన్ని
శోధించామని
గొప్పలు చెప్పుకునే
లోకం
నీ అంతాన్ని
నీ అంతరంగాన్ని
అన్వేషించగలిగిందా
ఎంత లోపలి దిగినా
అంతే లేని నీ అంతం
తెలిసిందా
నిన్ను చూస్తూ ఉంటే
నీలో నన్నే
చూసుకుంటున్నా
ఎగసిపడే నా ఆవేశమే
చూసారు అందరూ
ఆవేశం లోతుల్ని
తడిమి చూసింది ఎవరు
గుండె లోతుల ఆవేదనను
తెలుసుకున్నది ఎవరు
అప్పుడప్పుడూ ప్రశాంతంగా
ఆవేదన
తన్నుకొచ్చినప్పుడు
ఎగసిపడే నీ కెరటంలా
నేను నీలా కనిపించనా
నీలో నా రూపమే కదలాడదా
సముద్రమా
ఎగసిపడే కెరటమా
నీవూ నేనూ
ఎప్పటికీ
ఎవరికీ
అర్ధమే కాని
సమాధానమే లేని
ప్రశ్నలమే కదా..
No comments:
Post a Comment