ఆకలి నా మతం
ప్రవక్తల ప్రవచనములు
నా చెవులకు ఎక్కలేదు
నమాజులో రివాజులు
నాకు అస్సలు తెలియదు
మహాత్ముల బోధనలు
నాకు అర్థం కాలేదు
శిలలా మారి
ఉలకని పలకని
రాముడి చరితం నాకు తెలియదు
దేవుడనే అంటారు
ఆయనకు శిలువ
ఎవరు వేసారో
తెలియనే తెలియదు
గురుబాణీ రాగాలు విన్నా
అంతరార్ధం ఎవరూ చెప్పలేదు
మసీదు ముందు చేతులు
చాచేది నేనే
గుడిమెట్ల ముందు
దీనంగా కనిపించేదీ నేనే
చర్చి గేటు ముందు నేనే
గురుద్వారా వాకిలి నేనే
ఎడారిలా మారిన కనుల చెలమల్లో
ఒక చుక్క కోసం
ఆరాటం నేనే
గుప్పిట మూసి ఇచ్చినా
నిర్లక్ష్యంగా విసిరేసినా
ఆ రూపాయి నాణెంలో
మెరుపును నేనే
తలమీద తాజ్ తో
నాముందు నిలిచినా
నుదుట తిలకంతో
నడుస్తూ వస్తున్నా
ఆ అడుగులే నాకు దైవాలు
మండుతున్న
నా శ్వాసలో
ఎండుతున్న పెదాలలో
ఎడారులైన కనుల మైదానంలో
కరుణ వర్షం కురిపించే
ఆ చేతులే నా జీవ రక్షలు
అవును నేను మనిషినే
ఆకలి నా మతం
good poetry
ReplyDelete