నాలో ఉన్న ప్రేమ
వీధులలో సంచరిస్తూ
కూడలిలో తిరుగుతూ
నీ పాటలు పాడుకోను
నేను
ఓంటరితనమనే నేస్తం
నాగుండె తలుపు
తట్టినప్పుడు
ఆ గుండె గుడిలో
కొలువైన నీవు
అప్రయత్నంగానే
నా గళం ద్వారా
ఉబికివస్తావు
పసందైన పాట రూపంలో
అది నువ్వూ నేనూ
ఇష్టపడి పాడుకున్న
గీతమే
నవ్వుతూ తుళ్ళుతూ
ఆలపించిన రాగమే
నేడూ అదే గానం
నా పెదాలపై
నర్తిస్తోంది
నాడు చిరునవ్వులతో
సాగిన గానం
నేడు వాడిన పెదాలలోనూ
వికసిస్తోంది
ఒక తేడా మాత్రం
కనిపిస్తూనే ఉంది
యుగళగానానికి వెన్నెల కురిపించిన
కన్నులు ఇప్పుడు
జలపాతాలై
ప్రవహిస్తున్నాయి
పెదాలపై చిరునవ్వులు
మాయమైనా
కన్నుల వెన్నెల
కరిగిపోయినా
ఆ గీతాలు మాత్రం జాలు
వారుతూనే ఉన్నాయ్
నాలో ఉన్న ప్రేమలా
మనస్వినీ
No comments:
Post a Comment