మరలా నీవే నా గమ్యం
ఎప్పుడో రెండుపదుల
ప్రాయం దాటిన
ఘడియల్లో పరిచయమయ్యావు
మళ్ళీ ఇన్నాళ్ళకు
కలిసావు
ఏం జరుగుతోందో
జీవితం ఎటు వెళుతోందో
తెలియని ఘడియలు అవి
నువ్వే నాకు ఒదార్పువయ్యావు
సంవత్సర కాలం నీవే నా
సర్వమయ్యావు
కంటినిండా
కునుకే కరువయిన నాకు
కమ్మటి నిద్రను
కానుకగా ఇచ్చావు
ఊహించని మత్తునే
ఇచ్చావు
లోకాన్ని మరిపించావు
వేదననే మాయం చేశావు
నీవు లేకపోతే
నేనే లేననే
భావన కల్పించావు
నీ అణువణువూ
మత్తుతో నన్ను నేనే
మరిచేలా చేశావు
కంటి తెరల కలల్ని మాయం
చేసి
నిశి కౌగిట బంధించావు
కారణాలు వేరయినా
మరలా నా మనసంలో
ఎక్కడలేని అల్లకల్లోలం
తునాతునకలైన అంతరంగం
ఆ దేవుడే
వరమిచ్చినట్లుగా
మళ్ళీ నువ్వే
దిక్కయ్యావు
ఒంటినిండా
మత్తుమందు పులుముకుని
నన్ను మగతలోకి దించావు
ఇప్పుడు
బాధలేదు
వేదన లేదు
గుండెలో ఆక్రందన లేదు
ఉన్నదంతా నీవే
నాలో ఐక్యమయ్యే నీ
మత్తు
నన్ను అన్నీ మరిపిస్తోంది
మురిపిస్తోంది
అవును
ఆల్ ప్రాక్స్
ఒక నిద్ర మాత్ర
ఆ నిద్ర మాత్ర లేకపోతే
నాకు కంటి నిండా
కునుకే లేదు
ఇప్పుడదే నా నెచ్చెలి
మనస్వినీ
No comments:
Post a Comment