చకోరపక్షి
రాలిపోయే పువ్వులోని
మకరందంలా
ఆరిపోయే దీపంలోని
వెలుతురులా
ఆగిపోయే ఊపిరిలో
శ్వాసలా
మరలా తిరిగిరాని
వెన్నెలలా
నిశి రాతిరికి ముందు
వీడ్కోలు పలికే
నులివెచ్చని ఎండలా
కొన్ని అనుభవాలు
మరికొన్ని అనుభూతులు
ఏనాటికీ చెదిరిపోని
జ్ఞాపకాలుగా
మిగిలే ఉంటాయి
ప్రతి అనుభూతీ
అజరామరం
ప్రతి అనుభవం
ఒక తీయని శాసనం
అయితే
చివరి అనుభూతి
చివరి అనుభవం
గుండెలో నిలిచిపోతుంది
ఒక దీపంలా
మరలా దక్కని ఆ ఘడియ
ఇక తిరిగి రానే రాదని
తెలిసిన మనసు
ఆ అనుభవాల నీడలనే
కాగడాలుగా మలుచుకుని
ఆ జ్ఞాపకాల వెలుగులనే
బాటలో పరుచుకుని
ముందుకే సాగుతోంది
చంద్రుని కోసం
చకోర పక్షిలా
నెలవంక అందదని
తెలిసినా
మనస్వినీ...
Excellent Poem
ReplyDelete