ముద్దాడుతున్న భావాలు
మనసు పొరలపై కదలిక
గులాబీ రేకులతో
గుండెపై మెత్తగా
మీటుతున్న భావన
నిర్వేదమైన మనసుపై
పన్నీరు చిలికిన
స్వాంతన
కన్నీరు మున్నీరైన
మనసులో
అప్పుడే వికసించింది
ఓ సజల పుష్పం
రోదిస్తున్న మానసంలో
ఎందుకీ వింత
క్షణంపాటు
ఏమిటీ పులకింత
ఎవేవో ఆలోచనలు
వేదనకు బదులుగా
చిన్ని చిన్ని ఆశలు
క్షణంలోనే ఎంత మార్పు
ఎంత ఓదార్పు
అప్పుడు నా ఆలోచనలకు
తట్టింది
నువ్వు నా అక్షరాలను
తడుముతున్నావని
నా భావాల గుండెను
సుతిమెత్తని వేళ్ళతో
సుతారంగా
మీటుతున్నావని
మఖ్ మల్ వస్త్రంతో
మేలిమి బంగారం వర్ణంతో
నా గుండె రాతలను
నీ చేతులు
కదిలిస్తున్నాయని
నా అక్షరాలను
నా భావాల మాలికలను
నీవు ఏ భావంతో
తడుముతున్నా
ఆగ్రహంతో
కదిలిస్తున్నా
ఆరాధనతో తట్టి
లేపుతున్నా
నీలో భావాలేవీ
కలగకున్నా
నా మనసు పుస్తకం లోని
అక్షరాలన్నీ
నిండైన తమకంతో
ఎనలేని ఆరాధనతో
నీ పట్టులాంటి వేళ్ళను
ముద్దాడుతూనే ఉంటాయి
ఆర్తిగా
మనస్వినీ
No comments:
Post a Comment