ఎందుకో ఇలా అనిపిస్తోంది
ఎందుకో మరి
మొదటిసారి ఇలా
అనిపిస్తోంది
ఎన్నడూ లేని ఆలోచన
ఇప్పుడు పుడుతోంది
నిరాశలోనూ
ఆశల పల్లకి మోసే మనసే
ఇప్పుడు మరోలా
ఆలోచిస్తోంది
ఏమయ్యిందో తెలియదు
కొత్తగా ఆలోచిస్తోంది
ఎందుకో మరి
మొదటిసారి ఇలా
అనిపిస్తోంది
కొండల నడుమ జారుతున్న
సూరీడు
ఇక మళ్ళీ రానే రాడేమో అనిపిస్తోంది
తనకే తెలియని
సరికోత్తలోకంలో
సేదతీరాలని
ఉదయభానుడు తహ
తహలాడుతున్నాడని
అనిపిస్తోంది
రవికిరణాలు
నిశి కన్యకు వీడ్కోలు
పలికినట్లు
అనిపిస్తోంది
చల్లని వెన్నెల జాబిలి
మేఘమాలికలపై అలిగి
మరో లోకంవైపు
పరుగులు తీస్తున్నట్లు
అనిపిస్తోంది
ఆకర్ష వికర్షల సమరంలో
గురుత్వాకర్షణ
గతి తప్పిందని
అనిపిస్తోంది
సాగరగర్భంలో జనియించిన
మేఘతల్పం
బీడు నేలను వీడి
మరలా
సముద్రుడిపైనే
కురుస్తోందనిపిస్తోంది
మనసు నింగిలో
హాయిగా విహరించిన
విహంగం
కొత్త తీరాలకు
పయనిస్తోందని
అనిపిస్తోంది
మనసు భావాలకు జతగా
నడిచిన
అడుగులు
దిశను మార్చుకుని
జాడలు మాయం
చేస్తున్నాయని
అనిపిస్తోంది
కరిగిపోతున్న
అడుగుల జాడలు
రాలిపడిన
నా స్వప్నాలకు
ఆనవాళ్లని
అనిపిస్తోంది
ఇదంతా కల్పితమనీ
ఒక పచ్చి అబద్దమనీ
అంతా ఒక భ్రాంతి అనీ
తేలిపోతే ఎంత
బావుండేది
మనస్వినీ
No comments:
Post a Comment