ఏమని సమాధానం చెప్పను ?
కంటి కొలను నుంచి
జారిపడింది ఓ నీటి
చుక్క
నులివెచ్చగా
నా చెంపను తాకుతూ
కిందకు జారుతున్న
కన్నీటి చుక్కను
ఒడిసి పట్టుకున్నా
ఆ నీటి బిందువును
నిండుగా చూసుకున్న
కనులకు
ఏమయ్యిందో ఏమో గానీ
సజల నేత్రాలయ్యాయి
రాలిపడిన ఒక చుక్కకు
సంఘీభావంగా
కన్నీరు వరదగా
ఉబికింది
నాలో పుట్టిన కన్నీరే
నన్ను సునామీగా చుట్టు
ముట్టి
నిలదీసింది
నీ మనసులోని భావాల
పుష్పంగా వికసించిన
నన్ను
వేదనతో కరిగించి
బయటకు ఎందుకు
విసిరేసావని
వేదనతో కరిగిన
నా మనసు పుష్పమే
నన్నెందుకు కరిగించావని
ఎదురు తిరిగితే
ఏమని సమాధానం చెప్పను
జలజలా రాలుతున్న
కన్నీరు
నా పాదాలను ముద్దాడి
పుడమిలో కలిసి
మట్టిలో ఇంకిపోతుంటే
ఎరుపెక్కిన కన్నులు
నిర్వేదంతో వీడ్కోలు
పలికాయి
బరువెక్కిన
నా హృదయంలా
మనస్వినీ
No comments:
Post a Comment