ఇదేనా మరణం ?
మనసు చంపుకుని కాదు
మనసు నిండా రాసుకున్నా
భావాల పుష్పాలను
అనురాగమనే తేనెలో రంగరించి
ఒక్కో అక్షరాన్ని
ఊపిరిలో శుద్ధి చేసి
మనసులో మరో భావానికి
స్థానం లేకుండా
ప్రతి భావాన్ని తనకే
అంకితమిచ్చి
ప్రతి అక్షరాన్ని
తన పాదాక్రాంతం చేసి
మనసు పుస్తకంలో
అనుభూతిని వెలికి తీసి
అక్షర మాలలుగా పేర్చి
నా సర్వమూ తనే అంటూ
అభినందన మాలికలను మలిస్తే
నా భావం తిరస్కారమయ్యింది
గుండెకు తాకాల్సిన పుష్పం
శూలంలా మారింది
ఎవరికీ నచ్చని నా కవిత్వం
ముక్కలు చెక్కలుగా
చెత్తబుట్ట పాలయ్యింది
అనుకోలేదు ఇలా అవుతుందని
ఊహించలేదు
సమాజం సైంధవ పాత్ర పోషిస్తుందని
నమ్మలేదు నా అక్షరాలూ
రాలిపోతాయని
ఇది అక్షర మరణమా
నా భావాల స్మశానమా
లేక
ఇదే నా మరణమా?
No comments:
Post a Comment