తెల్లారని సూరీడులా
గుండెలో శక్తినంతా
కూడదీసుకున్నా
అడుగు తీసి అడుగు వేస్తున్నా...
మట్టిలో కూరుకుపోతున్న పాదాలను
బలంగా పైకి లాగి
మరో అడుగు వేస్తున్నా...
ఎందుకో
ఏమయ్యిందో
పుడమి తల్లి పగబట్టిందో
భూమాతకు నా పై ప్రేమ పెరిగిందో
ఏం జరుగుతోందో
తెలియదు కానీ
అడుగులు నేలలోకే
దిగబడుతున్నాయి...
ధరిత్రి గర్భం నుంచి
బయటికి రాలేమని
పంతం పట్టాయి
అడుగులజాడలు...
కనులు పైకెత్తి చూస్తే
అక్కడెక్కడో దూరానా
కొండల నడుమ జారుతూ
తన ఉనికిని
కోల్పోతున్న సూరీడు
వెక్కిరిస్తున్నాడు
జారిపోతున్న గమ్యంలా
కరిగిపోతున్న కలలా...
ఇక చాలంటూ దేవుడు
నీలి నింగిపై
నల్లని రంగు అద్దుతున్నాడు
తన కుంచెతో...
మెల్ల మెల్లగా చేరిన నలుపు
నన్నూ చుట్టుముట్టేసింది
నిశీధి దుప్పటిలా...
నన్ను నేను వెతకలేక
నా జాడే తెలియలేక
చీకటిలో కలిసిపోయాను
తెల్లారని సూరీడులా...
No comments:
Post a Comment