నీటి బుడగలు కాదు
నీటి మీద బుడగలు కాదు
నా రాతలు
పనిలేక రాసుకోను నేను
నా కవితలు
అనుభవాలనుంచి
ఏరుకున్నా
అనుభూతులనుంచి
ఎన్నుకున్నా
మనసు తోటలో పుట్టిన
పుష్పాల నుంచి
పరిమళాలను అద్దుకున్నా
సుగంధ పరిమళాల
పువ్వులే నా రాతలు
నా ప్రతి ఘడియ
ప్రియమైనది కాదు
నా ప్రతి భావనా
తీయనైనది కానే కాదు
నా అనుభూతుల వెల్లువలో
అనుభవాల తోటలో
పువ్వులున్నాయి
అంతకు మించి ముళ్ళూ
ఉన్నాయి
అనుభవాలను జల్లెడ
పట్టి
రాళ్ళను ముళ్ళను
ఏరివేసి
అందమైన పువ్వులనే
కవితలుగా రాసుకున్నా
ఎందుకంటే
ఆ అనుభవాల పువ్వులు
నాకెంతో ఇష్టం
గుండెకు గుచ్చుకున్న
ముళ్ళకు
తీయని లేపనం అద్దేవి
ఆ అందమైన పువ్వులే
పువ్వులోని ముళ్ళే
గుండెకు గాయం చేసినా
ఆ పువ్వులోని
మకరందంతోనే వైద్యం
చేసుకున్నా
తీయని ఆ పువ్వుల తేనె
ముల్లు గాయాన్ని మాయం
చేస్తే
నా భావనలు మధురం
కాకుండా
ఇంకెలా ఉంటాయి
ఎప్పుడో ఒకసారి ముళ్ళు
చేసిన గాయం
కవితగా ఉబికివచ్చినా
పూబాల మకరందమే
నా భావాలకు
రారాణిగా విలసిల్లింది
అర్ధం చేసుకునే మనసే
ఉంటే
మనసులో భావాలకు చలనం
ఉంటే
కాసింత భాషాజ్ఞానం
ఉంటే
నా రాతలు
వికసించే పుష్పాలో
నీటి మీద బుడగలో
తెలుస్తుంది
మనసులో ఒక నిర్ణయానికి
వచ్చి
ఇంకేదో మదిలో దాచుకుని
ఏదో భ్రమలో ఊగిసలాడి
ఏదేదో ఊహించుకుని
తమకు తెలిసిన భాషే
అన్నింటికీ పరిభాషనీ
మూర్ఖంగా తర్కించే
వాళ్ళకు
లక్ష జన్మలు ఎత్తినా
నా రాతలు
అర్ధం కావు
మనస్వినీ
No comments:
Post a Comment