Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

Pages

Thursday 7 April 2016

నవ్వింది ఓ తారక

నవ్వింది ఓ తారక

అగ్ని వర్షం కురిపించిన భానుడు
అలసిసొలసి అస్తమించిన వేళ
అప్పుడప్పుడే వీస్తున్న పిల్లగాలులు
స్వేదబిందువులను తాగేస్తూ
దేహాన్ని చల్లగా తాకుతున్న వేళ
అక్కడక్కడా చెట్లు ఉన్నందుకేమో
చల్లని గాలి గుండెను తడుముతోంది
ఆరుబయట కుర్చీ వేసుకుని కూర్చున్నా
ఇక అలసిపోయానంటూ
వెలుతురు కనుమరుగవుతోంది
నిశి కన్య మెల్లగా కురులు విరబోసుకుంటోంది
ఆలోచనా తరంగాలలో చిక్కుకున్న నేను
మెల్లగా నింగి వైపు చూశాను
ఉన్నదో లేదో తెలియని నింగి
నీలి కాన్వాసులా పరుచుకుని ఉంది
కాన్వాసుపై పువ్వుల్లా
అక్కడక్కడా మెరుస్తున్న తారకలు ముద్దొచ్చాయి
మనసు కాసింత తేలికై
ఓ చుక్కలమ్మను పలకరించాను
ఫక్కున నవ్వింది ఓ తారక
చుక్కలమ్మా ఎందుకు నీకింత మిడిసిపాటు
మౌనంగానే అడిగింది మనసు
మెరుపును అరువు తెచ్చుకున్న నన్ను చూసి
ముచ్చట పడుతున్నావ్
నా వైభవం కొన్నిఘడియలే కదా
సూరీడు నిద్ర లేస్తే
వెలుతురులో కలిసిపోయే నేను
ఈ నింగిలోనే సమాధిని కానా
నన్ను చూసి సేదతీరే నువ్వు
చీకటి వెలుగుల బాటసారివే కాదా
మనసు గోసను తెలిపిన తారక
మెల్లగా కనుమరుగయ్యింది
నీలి నింగిని శోధిస్తున్న కన్నులకు
ఎక్కడో దూరాన రాలిపడుతున్న
ఓ చిరుతార కనిపించింది
రాలిపడుతున్న తారకల పొడిలో
నా స్వప్నాలను వెతుక్కుంటూ
భారంగా కన్నులు మూసుకున్నా
మనస్వినీ

1 comment:


  1. ప్రస్తుతం ఉన్న వెబ్సైట్లకంటే కాస్త భిన్నంగా విదేశాలలో నివసిస్తున్న మన భారతీయుల కొరకు రూపొందించబడింది www.kuwaitnris.com.

    ReplyDelete