మామిడాకులు
నిగ నిగలాడే వర్ణంతో
చిరుగాలికే సవ్వడి
చేస్తూ
వయ్యారంగా కదులుతున్న
లేత ఆకులు
మామిడాకులు
అవి నా నేస్తాలు
కాలం తెలియకుండా
వాటినే చూస్తూ
మనసు భాషలో వాటితో
ముచ్చటిస్తూ
కాలం గడిపేయటం నాకు
ఎంతో ఇష్టం
ఆ పచ్చని ఆకులు నన్ను
పలకరిస్తాయి
యోగక్షేమాలు
తెలుసుకుంటాయి
అప్పుడే విరిసిన
మారాకును చూస్తున్నా
ప్రౌఢ వయసుకు చేరిన
దళసరి పత్రాన్నీ చూస్తున్నా
వయసుడిగి ఎండిపోయి
రాలిపోయేందుకు
ఊగిసలాడుతున్న
పండుటాకునూ చూస్తున్నా
చిరుగాలికూడా సునామీలా
పరిణమించి
నేలను ముద్దాడుతున్న
పండుటాకును చూసిన మనసులో
ఏదో తెలియని వేదన
నలువైపులా సమరంలో ఓడిన
ఆవేదన
అందరూ ఉన్నా ఎవరూ లేని
చందాన
అంతిమపయనం భావన
రాలిపడిన ఆకును చూస్తూ
ముభావంగా మారిన మనసుకు
అప్పుడే ఓ చిరు
పలకరింత
అవును అప్పుడే మొగ్గ
తొడిగిన మారాకు
పచ్చగా పలకరించింది
నేనున్నానంటూ హాయిగా
నవ్వింది
ఆ పిల్ల ఆకును చూస్తూ
రాలిపడిన గతం మరిచి
మనసు కాసింత సేద తీరే
వేళ
పక్కనే ఉన్న మరో
ఎండుటాకు
నేలను తాకింది
మనస్వినీ
No comments:
Post a Comment