శిరస్సువంచిన శిఖరం
నిప్పు పెట్టిన వారు
లేరు
ఆజ్యంపోసిన వారు
కానరారు
బడబాగ్నిలా మంటలు
లేచాయి
దావాలనంలా
చుట్టుముట్టాయి
ఆశల సౌధం కాలిపోయింది
పలుగూ పారా పట్టలేదు
ఎవరూ
పునాదులు పెకిలించలేదు
ఎవరూ
పుడమి ప్రకంపించింది
నేల బీటలు వారింది
ఒక శిఖరం నేలను
ముద్దాడింది
దహనమైన సౌధంలో
మిగిలిపోయిన బూడిదలో
కాలిపోయిన గతాన్ని
వెతుక్కుంటున్నా
కూలిన శిఖరం
శిథిలాల్లో
కూరుకుపోయిన ఆశలను
ఏరుకుంటున్నా
వెక్కిరిస్తున్న గతంతో
మాటలు కలుపుతున్నా
కరిగిపోయిన ఆశలను
దోసిటపట్టాలని చూస్తున్నా
మెదడుతో కాక మనసుతో
నడిచిన
శిథిల జీవితాన్ని మరలా
కుప్పగా పోసుకుంటున్నా
దుమ్ముపట్టిన శిథిలాలు
బూడిదగా మారిన
ఆనవాళ్ళు
మనసును మెలియపెడుతూ
ఉంటే
అప్రయత్నంగానే వెనక్కి
తిరిగి చూసా
ముసిముసి నవ్వుల సమాజం
కనిపిస్తోంది
మనస్వినీ
No comments:
Post a Comment