ఎంత మధురం ఆ
శుభోదయం
వెచ్చని కోర్కెలు
రగిలిన ఉదయభానుడు
నిశి దుప్పటిలో
సేదతీరుతున్న పుడమికన్యపై
తన చిలిపి కిరణాల
బాణాలు విసురుతున్న వేళ
బడలికతో నిదురించిన
పుడమి
నులివెచ్చని కొంటె
స్పర్శకు
తనువు సవరించుకుంటున్న
తరుణం
పక్షుల కువకువలకు
కనులు తెరిచిన నేను
పక్కనే ముడుచుకున్న
పద్మంలా
కెరటాలను కడుపులో
దాచుకున్న కడలిలా
సేదతీరిన పాలరాతి
శిల్పంలా
నిదురిస్తున్న
రతీదేవిలా నిన్ను చూశా
ఇంకా నీ నుదుటి మీద
చెమట చుక్కల ఆనవాళ్ళు
రాతిరి కథలను చెప్పకనే
చెబుతున్నాయి
ఇంకా తమ భారం తీరలేదని
అలసటగా కదులుతున్న
కనురెప్పలు
విరిసీ విరియని పెదాలు
నువ్వింకా సేదతీరలేదని
చెబుతున్నాయి
నిన్ను చూసిన నేను
గాలిని కూడా సవ్వడి
చేయనీయకుండా
మెల్లగా నీపై వాలి
నా పెదాలతో నీ
నుదుటిపై సంతకం చేస్తుంటే
ఒక్క ఉదుటున నీవు
నన్ను నీ బాహువుల్లోకి
బంధిస్తే
ఆ శుభోదయం
ఎంత మధురం
మనస్వినీ
No comments:
Post a Comment