రేపటికోసం మరణించను
రేపన్నది ఎవరికీ తెలియదు
రేపటి రూపం ఊహించజాలము
చిరునవ్వులు
విరబూస్తాయో
విరిసిన పువ్వులు వాడిపోతాయో
కాలానికే తెలియదు
ఎలా ఉంటుందో తెలియని
రేపటికోసం
నేడు మరణించను
రేపటికోసం ఎదురు చూడక
నేడు జీవించటమే నా
లక్ష్యం
నిన్నటి మరకలను
నేటి కాగితంపై
రుద్దుకోను
నేడు అనే తెల్లని
కాగితంపై
నడుస్తున్న కాలాన్నే
పువ్వులుగా రాసుకుంటా
నిన్నటి ఘడియలను
గతానికి అప్పజెప్పి
నేటి క్షణాల్లోనే
ప్రాణవాయువు నింపుకుంటా
అవును
ఇదే నా జీవనం
రేపటి కాలం కోసం
ఎదురుచూడక
నిన్నటి గతంకోసం
విలపించక
నేటిలోనే అడుగుజాడలు
వెతుక్కుంటా
ఎన్ని ఘడియలు
జీవించానన్నది కాదు
ఎంత ఆనందంగా జీవించానన్నదే
నాకు ముఖ్యం
మనస్వినీ
No comments:
Post a Comment