నడియేట తీరాల వేట
రాళ్లయినా
ముళ్ళయినా
పూలబాటనుకున్నా
ఇసుకతిన్నెలు ఎదురైనా
వాగులు వంపులు మలుపులు
తిప్పినా
అడుగులు వేస్తూనే
ఉన్నా
నిశి రక్కసి బాహువులు
విసిరినా
సిరివెన్నెల దేహాన్ని
తడిపినా
ముందుకే నడిచాను
కళ్ళను కాగడాలు
చేసుకుని
మనసును మైదానం
చేసుకుని
నడుస్తూనే ఉన్నా
నా నడకను మించిన వేగం
నా కళ్ళకు అందని
దృశ్యం
నా కంటే ముందే పరుగులు
తీసింది
అవును నేను ఎంత
అందుకోవాలని తపించినా
గమ్యం నా నుంచి దూరమై
అందని ద్రాక్ష పండై
నాకు దూరంగా పరుగులు
తీస్తూనే ఉంది
ఒక్కసారి వెనక్కి
తిరిగి చూస్తే
నా అడుగుల జాడలు కూడా
చెదిరిపోయాయి
ఇది నడియేట తీరాల వేటే
కదా
మనస్వినీ
No comments:
Post a Comment