రహస్య సమరం
నిశి సంకెళ్ళలో బంధీ
అయిన మనసు
ఒంటరి పోరాటం
సాగిస్తోంది
బయటికి కనిపించని
శతృవుతో
తుది సమరం చేస్తోంది
కరవాలం దూస్తున్నా
తూటాలు కురిపిస్తున్నా
రహస్య శతృవు నీడను
కూడా
తాకలేదు మనసు
పూలవానకు పులకించి
శరపరంపర ముళ్ళకు
ఛిద్రమయ్యింది మనసు
కనిపించే శత్రువు
బలాన్ని లెక్కచేయని మనసు
అజ్ఞాత విరోధి ముందు
తలవాల్చేసింది
ఎటు అడుగు వేస్తే ఏ
సర్పం పడగ విసురుతుందో తెలియని
నిశి సమరంలో
గుండె దిటవు చేసుకుని
నడిచినా
తనలోనే పాగావేసిన
శత్రువు ముంగిట
అస్త్రసన్యాసం
చేస్తోంది మనసు
అవును
నాకు సమాజంలో
శత్రువులే లేరు
నాతో పోరాటం చేసే
సత్తువ లోకానికి లేదు
నాలోనే దాగి
నన్ను బలహీనం చేసి
అందరి ముందు చులకన
చేసి
ఆలోచనలను దహియించి
ఆవేశాన్ని రగిలించి
నేను నేను కాదని
నాలో మరో రూపం ఉందని
నా నడత
నా నడక
నా లక్ష్యం
నా గమ్యం
అంతా మరో కోణమని
మాయలు చేసి
లేని మతలబులు చూపి
నేను నిజంగా నేను కాదా
అని అనుమానం రేపిన
నాలోని శత్రువుతో
రహస్య సమరం చేస్తున్నా
ఇదే తుది సమరమనీ
ఓటమి తప్పదని తెలిసినా
నాలోని మరో మనిషిపై
తిరుగుబాటు చేస్తున్నా
మనస్వినీ
No comments:
Post a Comment