కనులలో నీ రూపం
మనసు కాన్వాసుపై వెండి
చందమామలా
మానస సరోవరంలో విరిసిన
పద్మంలా
నేలదిగిన తారకలా
నిన్ను చూస్తుంటే
నీ సోయగాలను తనివితీరా
కనులతోనే
తడుముతుంటే
నాలో కలిగిన చిరు
ఆలోచన
నీ బొమ్మను పదిలం
చేసుకోవాలని
నీలోని అందాలను
నీలోని సోయగాలను
కడలిని మించిన
పరువాలను
కనులలోని జీవన
తరంగాలను
ఒక రూపంలా
అందమైన దృశ్యకావ్యంలా
తెల్లని కాన్వాసుపై
మలుచుకుందామనుకుంటే
నీ మేని రంగుల ముందు
నేను ఏరుకున్న
రంగులన్నీ తెల్లబోతున్నాయి
నీ కన్నుల వెలుగులను
నీ పెదాల మెరుపులను
నీ కురుల నీడలను
నీ మేని వంపులను
అన్నీ కలగలిపి
కవితలుగా
అల్లుకుందామని అభిలషిస్తే
అతిలోక సౌందర్యం ముందు
మేము తూగగలమా అంటూ
అక్షరాలు పారిపోయాయి
రవివర్మ కుంచెకు
కవిరాజు అక్షరాలకు
అందని నిన్ను
నా కన్నుల లోగిళ్ళలో
దేవతలా
గుండె గుడిలో దీపంలా
పదిలం చేసుకుంటా
మనస్వినీ
No comments:
Post a Comment